ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత అంటే మహారాణిలా గౌరవ మర్యాదలు పొందేవారు. కానీ ఎప్పుడైతే ఆమె తండ్రి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేయాలనుకున్నారని, ఆయన చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయని అన్నారో అప్పటి నుంచి ఆమెతో బిఆర్ఎస్ పార్టీకి తలనొప్పులు మొదలయ్యాయి.
తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ ఇద్దరూ దూరం పెట్టడంతో బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆమెకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోయారు. కనుక తెలంగాణ జాగృతితో ఏదో హడావుడి చేస్తున్నా ఫలించడం లేదు.
కానీ బీసీ రిజర్వేషన్స్ పెంపు కోసం రైల్ రోకో చేస్తామని ప్రకటించడం, వామపక్షాల మద్దతు కోరడం వంటివి బిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్స్ విషయంలో ఏవిదంగా ముందుకు సాగాలనే విధానపరమైన నిర్ణయం ఏమీ తీసుకోలేదు. కనుక ఆమె చర్యలను ఔననలేదు కాదనలేదు.
ఇక ఆంధ్రా బిర్యానీ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌కి తలనొప్పిగా మారాయని చెప్పక తప్పదు. ఆనాడు ఉద్యమ సమయంలో ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకే ఆవిదంగా మాట్లాడాను తప్ప ఆంధ్రావాళ్ళపై నాకు ఎటువంటి కోపం, ద్వేషం లేవని కేసీఆర్ సర్ధిచెప్పుకుంటే, “ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ చెప్పారుగా?” అంటూ ఈరోజు కల్వకుంట్ల కవిత అన్న మాటలు ఆంధ్ర ప్రజలకు ఆగ్రహం కలిగిస్తున్నాయి.
ఆంధ్రా మీడియాలో కల్వకుంట్ల కవిత ఆంధ్రా బిర్యానీ గురించి అన్న ఈ మాటలు ఏపీలో మీడియాలో వచ్చింది. బనకచర్ల పేరుతో బిఆర్ఎస్ పార్టీ ఏపీతో పోరాడుతుంటే, ఆనాడు కేసీఆర్ ఆంధ్రా బిర్యానీ గురించి అన్న మాటలని కల్వకుంట్ల కవిత గుర్తుచేసి తండ్రికి ఇబ్బందికర పరిస్థితి కల్పించారని చెప్పక తప్పదు.