మాజీ మంత్రి హరీష్ రావుని ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారించినప్పటి నుంచి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ సిఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం సిఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున మంత్రులు వారికి ధీటుగా బదులిస్తున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, “ఇకపై కేసీఆర్ క్రమం తప్పకుండా శాసనసభ సమావేశాలకు వస్తారన్నట్లు బీఆర్ఎస్ నేతలు చెపితే నిజమే అనుకున్నాము.
కానీ హాజరు కోసం మొదటి రోజువచ్చి సంతకం పెట్టి మూడు నిమిషాలలో తిరిగి వెళ్ళిపోయారు. మీరు ఎమ్మెల్యే కనుక ప్రభుత్వం ప్రజాధనం నుంచి మీకు జీతభత్యాలు చెల్లిస్తోంది. కానీ రెండేళ్ళుగా మీరు శాసనసభ సమావేశాలకు రావడం లేదు. కనుక ఇంతవరకు తీసుకున్న సొమ్మంతా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తే బాగుంటుంది,” అని సూచించారు.
కేటీఆర్‌ని ఉద్దేశ్యించి, “హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరూ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీశారు. నన్ను పార్టీ నుంచి బయటకు గెంటించేశారు. ఇప్పుడు నిన్ను కూడా ముంచేస్తారు జాగ్రత్త రామన్నా అంటూ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఆమెకు సమాధానం చెప్పరా?” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.