రాజుగారు, ఏడు చేపల కధ అందరూ వినే ఉంటారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదేవిదంగా సాగుతున్నట్లనిపిస్తుంది. దిగువ స్థాయి పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే తమపై అధికారులు ఆదేశం మేరకే అలా చేశామని చెప్పారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న ప్రభాకర్ రావుని సిట్ అధికారులు ప్రశ్నించగా మొదట ఆయన సహకరించలేదు. కానీ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించేసరికి అప్పటి డీజీపీ ఆదేశం మేరకే ఫోన్లు ట్యాపింగ్ చేశానని, ఈ విషయం అప్పటి ప్రభుత్వ పెద్దలకు (కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు)లకు తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది.
అంటే ఇప్పుడు ఆయన తప్పించుకోవడానికి మాజీ డీజీపీ పేరు చెప్పినట్లు భావించాల్సి ఉంటుంది. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా మాజీ డీజీపీని పిలిపిస్తే, బహుశః ఆయన రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి పేరు, ఆయనని పిలిస్తే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు చెపుతారేమో?
అయితే ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేదని కేసీఆర్ ఇదివరకే చెప్పారు. ఒకవేళ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానికి వారే బాధ్యులు తప్ప తాను కానని స్పష్టంగా చెప్పారు.
కానీ 2023 ఎన్నికలకు ముందు అధికార ప్రతిపక్షాలతో సహా వివిద రంగాలకు చెందిన 615 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఇప్పటికే స్పష్టమైంది.
ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం. అది కేసీఆర్ ఆదేశం మేరకు బిఆర్ఎస్ పార్టీ కోసమే జరిగిందని సిట్ అధికారులు సాక్ష్యాధారాలతో సహా నిరూపించాల్సి ఉంటుంది.
ఏది ఏమైనప్పటికీ ఏదో ఓ రోజు ఈ విచారణ మాజీ సిఎం కేసీఆర్ వద్దకు వచ్చి ఆగుతుంది. అప్పటికైనా ఈ ఏడు చేపల కధ ముగుస్తుందా లేదా న్యాయపోరాటాలతో కధ మళ్ళీ మొదటికొస్తుందా? చూడాలి.