ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (ఏ-1) బుధవారం మరోసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మరో నిందితుడైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు చెప్పిన వివరాల ఆధారంగా సిట్ అధికారులు ఆయనని కొన్ని ప్రశ్నలు అడిగారు.
ఆయన సమాధానాలు చెప్పడానికి నిరాకరిస్తూనే ఉన్నారు. దీంతో అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళి ఆయనని అరెస్ట్ చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయించాలని భావించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇస్తేనే అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చి విచారణకు హాజరావుతానని ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు, అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కానీ అరెస్ట్ చేయవద్దని సిట్ అధికారులను ఆదేశించింది. కానీ విచారణకు తప్పనిసరిగా సహకరించాలనే షరతుపై అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇస్తున్నామని సుప్రీంకోర్టు అప్పుడే చెప్పింది. కానీ ఆయన సహకరించడం లేదు.
కనుక సుప్రీంకోర్టుకి ఈ విషయం తెలియజేసి ఆ మద్యంతర ఉత్తర్వులు రద్దు చేయించి అరెస్ట్ చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశః ప్రభాకర్ రావుకి కూడా ఈవిషయం చెప్పే ఉంటారు.
ఇంతకాలం ఆయన అరెస్టుకి భయపడే హైదరాబాద్ రాకుండా అమెరికాలో కాలక్షేపం చేశారు. కానీ ఇప్పుడు ఆయన హైదరాబాద్‌లో ఉన్నందున మళ్ళీ అమెరికా తిరిగి వెళ్ళిపోలేరు. కనుక హైదరాబాద్ వచ్చి ఈ కేసులో చిక్కుకుపోయినట్లే భావించవచ్చు.