ముందు డాడీతో సెటిల్ చేసుకో అక్కా!

June 17, 2025


img

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి తన రాజకీయ భవిష్యత్‌ ఏమిటో తెలియని పరిస్థితిలో ఉన్నారని చెప్పక తప్పదు. ఆమె హటాత్తుగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులపై బహిరంగంగా విమర్శలు గుప్పించడంతో బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు దూరంగా ఉంటున్నారు. 

ఇటీవల ఆమె భర్తతో కలిసి ఫామ్‌హౌస్‌లో తండ్రిని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు కేసీఆర్‌ కనీసం ఆమె వైపు చూడకుండా పార్టీ నేతలతో కలిసి బయటకు వెళ్ళిపోయారు. 

ఆమెను బిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించనప్పటికీ, బిఆర్ఎస్ పార్టీ మద్దతు లభించకుండా రాజకీయాలలో ఒంటరిని చేశారు. 

తెలంగాణ జాగృతితో ఆమె ఎంత హడావుడి చేస్తున్నప్పటికీ ఆమెను మీడియా కానీ ఇతర పార్టీలు గానీ పట్టించుకోవడం లేదు!

బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసే ప్రయత్నాలను తాను అడ్డుకున్నానని చెప్పడంతో అప్రమత్తమైన బీజేపి ఆమె మాటలను ఖండించింది. 

మంత్రి పదవి ఇస్తే ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆమె కాంగ్రెస్‌ అధిష్టానంతో బేరసారాలు చేశారని వార్తలు రావడంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెకు దూరంగా ఉంటోంది. 

కనుక ఇంతకాలం తెలంగాణ రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన కల్వకుంట్ల కవిత, ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయి, తన రాజకీయ భవిష్యత్‌ ఏమిటో తనకే తెలియని పరిస్థితిలో ఉన్నపుడు బీసీ రిజర్వేషన్స్ అంశాన్ని భుజానికెత్తుకొని బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

ఈరోజు మెదక్‌లో బీసీ నాయకులతో రౌండ్ టేబిల్ సమావేశం నిర్వహించి, “బీసీలందరూ ఐకమత్యంగా పోరాడితే పదవులు మీ కాళ్ళ వద్దకే వస్తాయి. కేంద్రంపై ఒత్తిడి తెస్తే తప్ప బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం లభించదు. కనుక దీని కోసం జూలై 17న ‘రైలు రోకో’ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను,” అని అన్నారు. 

తనకు తండ్రి పార్టీలో, ప్రభుత్వంలో న్యాయం (పదవులు) జరుగకపోవడం వలననే ఆమె అసంతృప్తితో తిరుగుబాటు చేశారు. కనుక ముందుగా సొంత పార్టీలో న్యాయం పొందలేకపోయిన కల్వకుంట్ల కవిత, బీసీల కోసం కేంద్రంతో పోరాడుదామని, రైల్ రోకో చేద్దామని చెపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

తన తండ్రి కేసీఆర్‌ కేంద్రాన్ని ఎదుర్కోలేకనే విలీనానికి సిద్దమయ్యారని ఆమె స్వయంగా చెపుతున్నప్పుడు, ఆమె ఒంటరిగా కేంద్రంతో పోరాడగలరా? 

రేపు ఆమె తండ్రి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చేయమని చెపితే బీసీ రిజర్వేషన్ గురించి కల్వకుంట్ల కవిత మాట్లాడుతారా?అప్పుడు ఆమెను నమ్ముకొని ‘రైల్ రోకో’ చేసిన వారిపై కేసులు నమోదై జైలుకి వెళితే ఆమె వచ్చి కాపాడుతారా?


Related Post