కేసీఆర్‌కు ఇప్పుడు అదొక్కటే పని

June 09, 2024


img

బిఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండు పెద్ద అపజయాలు తట్టుకొని నిలబడటం చాలా కష్టమే. గత పదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలు తట్టుకొని నిలబడగలిగాయి కనుకనే మళ్ళీ రెండు పార్టీలు పుంజుకోగలిగాయి. వాటిలో కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి రాగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. కనుక కేసీఆర్‌ కూడా బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోగలిగితేనే మళ్ళీ ఎప్పటికైనా పునర్వైభవం వస్తుంది.  

కానీ కేసీఆర్‌ అహంకారంతో ప్రగల్భాలు పలకడం, అందరితో కయ్యానికి కాలు దువ్వడం వలననే ఇప్పుడు రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయీ ఈ దుస్థితికి చేరుకున్నారని చెప్పవచ్చు. శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా మిడిసిపడుతూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని లేదా కూల్చేస్తామన్నట్లు మాట్లాడటాన్ని ప్రజలు కూడా సహించలేదని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. 

కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలని అడ్డుకునే ప్రయత్నంలో రాష్ట్ర బీజేపీతో పోరాడే బదులు, రాజకీయంగా తన స్థాయిని పెంచుకునేందుకు మోడీతో కయ్యానికి కాలు దువ్వడం కూడా అతి పెద్ద పొరపాటే అని కల్వకుంట్ల కవిత అరెస్టుతో స్పష్టమైంది. అది ఆయన కుటుంబ సమస్య అని సరిపెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్‌ ఈ విపరీత ధోరణి వలన తెలంగాణ రాష్ట్రం కూడా చాలా నష్టపోయింది. లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పరాజయానికి ఇదీ ఓ కారణమే.  

ఇప్పుడు కేసీఆర్‌ వద్ద ఒక్క ఎంపీ కూడా లేరు కనుక బీజేపీ ఆయనను దగ్గరకు రానీయదు. పోనీ ఇండియా కూటమిలో కలుద్దామంటే అటు కాంగ్రెస్ పార్టీ ఉంది. కనుక ఆ తలుపులు మూసుకుపోయిన్నట్లే. ఒకప్పుడు కేసీఆర్‌తో చేతులు కలిపిన వామపక్షాలు, మజ్లీస్‌ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్‌ వైపున్నాయి. కనుక రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఏకాకిగా, బలహీనంగా ఉంది. 

కేసీఆర్‌ వలన ఎప్పటికైనా తన ప్రభుత్వానికి ప్రమాదం ఉందని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నందున ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌ అస్త్రం ప్రయోగించి బిఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టేయడానికి ప్రయత్నించవచ్చు. 

బిఆర్ఎస్ పార్టీని తుడిచి పెట్టేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా నిలబడగలుగుతుంది. లేకుంటే ఈ మూడు ముక్కలాట ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఈ అవకాశాన్ని బీజేపీ కూడా వదులుకోదు. అది కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలని నయాన్నో భయాన్నో ఎత్తుకుపోయేందుకు తప్పకుండా ప్రయత్నిస్తుంది. 

కనుక జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధానమంత్రి అవుదామని కలలుగన్న కేసీఆర్‌ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ చెల్లాచెదురు కాకుండా కాపాడుకోవడమే ఒకటే పెద్ద పనిగా మిగిలింది. Related Post