మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ యాక్షన్ సినిమాలలో పంచ్ డైలాగులు ఎంత అవసరమో కామెడీ సీన్స్ కూడా అంతే అవసరం. ఎందుకంటే థియేటర్లో ప్రేక్షకులని కూర్చోబెట్టాలి కదా. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య అటువంటి సీరియస్ యాక్షన్ సీన్స్ చూస్తున్న ప్రపంచదేశాలకి బోరుకొట్టకుండా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా మంచి కామెడీ చేశారు. ఇంతవరకు ‘యుద్ధం..అణుబాంబులు’ అంటూ చాలా బరువైన పంచ్ డైలాగ్స్ కొడుతున్న తన పాక్ ఆర్మీ జనరల్స్ ని ఆయన హెచ్చరికలు జారీ చేశారుట! పాక్ సైన్యం చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించే పాక్ ప్రధాని సైన్యానికి హెచ్చరికలు జారీ చేయడం కంటే గొప్ప జోక్ ఏముంటుంది? అంతే కాదు.. ఇంకా బోలెడన్ని జోకులు వేశారు.
ఇకపై ఐ.ఎస్.ఐ., సైన్యాధికారులు ఎవరూ కూడా ఉగ్రవాదులని ప్రోత్సహించకూడదుట! ప్రోత్సహిస్తే వారిపై ప్రభుత్వం కటిన చర్యలు తీసుకొంటుందిట! ఇకపై దేశంలో ఉగ్రవాదులని పాక్ ప్రభుత్వం ఉపేక్షించదుట! ముంబై ప్రేలుళ్ళకి కుట్రలు పన్నిన వారి మొదలు పఠాన్ కోట్ దాడుల వరకు కుట్రలు పన్నిన వారందరిపై న్యాయవ్యవస్థ చర్యలు చేపడుతుందిట! అప్పుడు పాక్ సైన్యాధికారులు, ఐ.ఎస్.ఐ. అధికారులు ఎవరూ జోక్యం చేసుకోకూడదుట!
నవాజ్ షరీఫ్ ఒకేసారి ఇన్ని జోకులు వేస్తే యావత్ ప్రపంచమే కాదు పాక్ సైన్యాధికారులు కూడా పగలబడి నవ్వుకొనే ఉంటారు. పాక్ సైన్యాధికారులని, ఐ.ఎస్.ఐ. అధికారులని హెచ్చరించి బ్రతికి బట్టకట్టిన పాలకుడు ఒక్కడు కూడా లేడు. ఒకప్పుడు దేశాధ్యక్షుడుగా వ్యవహరించిన జనరల్ పర్వేజ్ ముషారఫ్ అంతటివాడు, తన సైన్యమే తనని పట్టుకొని ఎక్కడ ఉరి తీస్తుందనే భయంతో లండన్ పారిపోయి బ్రతుకుతున్నాడిప్పుడు. మరి నవాజ్ షరీఫ్ పాక్ సైన్యాధికారులని హెచ్చరించారంటే నమ్మశక్యంగా ఉందా? ఈ జోకులన్నీ పాకిస్తాన్ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డాన్ ప్రచురించింది.
డాన్ పత్రికలో వచ్చిన ఈ వార్త మరొక విషయం కూడా చాటి చెపుతోంది. అదేమిటంటే, పాక్ సైన్యం, ఐ.ఎస్.ఐ. రెండూ ఉగ్రవాదులకి శిక్షణ, రక్షణా, ప్రోత్సాహం, సహాయ సహకారాలు అందిస్తున్నాయని! కనుక తమని భారత్ వేలెత్తి చూపిస్తోందని ఇక పిర్యాదు చేయడం కూడా అనవసరమే.