పాక్ దుస్థితికి ఎవరు కారణం?

October 01, 2016


img

భారత్, పాక్ రెండు దేశాలకి ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చింది. అనేక మతాలు, కులాలు, పూర్తి విభిన్నమైన వేష బాషలు, ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలతో ఒక మినీ ప్రపంచంలాగ కనిపిస్తుంది. అయిఅనప్పటికీ భిన్నత్వంలో ఏకత్వంగా ఒకే జాతి, ఒకే గొంతు, ఒకే జెండా అని ప్రజాస్వామ్యబద్దంగా సాగుతోంది. అ సాగడం కూడా కుంటుతూ కాదు అభివృద్ధి పధంలోకి శరవేగంగా దూసుకుపోతూ సాగుతోంది. ఏ రంగంలో పట్టి చూసినా ఆ సంగతి అర్ధం అవుతుంది.

ఇటువంటి వైవిధ్యభరితమైన నేపధ్యం ఉన్న భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ లో అసలు ఏ సమస్యలు ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్నదీ ఒకే మతం. మనకంటే చిన్న దేశం. తక్కువ జనాభా ఉంది. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ప్రభుత్వంపై సైన్యం ఆధిపత్యం సాధించగలిగింది. సైనిక విధానాలే తమ రాజ్యాంగమని నిసిగ్గుగా చెప్పుకొనే ముషారఫ్ సైనికాధికారులే ప్రభుత్వాలని శాసించారు. వారందరూ అపారమైన సంపదలు కూడబెట్టుకొంటూ, చాలా విలాసవంతమైన జీవితాలు గడుపుతూ దేశాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. తమ విలాసవంతమైన జీవితాలని ప్రజలు ప్రశ్నించకుండా ఉండటం కోసమే వారికి ఎల్లప్పుడూ భారత్ ని ఒక బూచిగా చూపిస్తూ వారిలో భారత్ పట్ల అకారణ ద్వేషభావాలు పెంచారు. దేశాన్ని పూర్తిగా తప్పు దోవలో నడిపించారు. 

ఆ కారణంగా దేశంలో నిరుద్యోగం, పేదరికం, అనారోగ్యం వంటి శతకోటి దరిద్రాలు పట్టి పీడిస్తున్నాయి. సైనికాధికారుల కర్ర పెత్తనం చేస్తుండటంతో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు కూడా వారికి భయపడి వారు ఆడించినట్లు ఆడవలసి వస్తోంది. చివరికి అందరూ కలిసి ఈ ఏడు దశాబ్దాలలో దేశాన్ని ఒక ఉగ్రవాదుల నిలయంగా మార్చి వేశారు. భారత్ పై దాడులకి పాల్పడుతూ సజీవంగా పట్టుబడినవారిలో కేవలం తమ కుటుంబాలని పోషించుకోవడం కోసమే ఉగ్రవాదులుగా మారమని చెపుతుండటం గమనిస్తే ఆ దేశ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పాక్ సైనిక పాలకుల చేతిలో ఒక సజీవ ఆయుధాలుగా మారిన వారిని చూస్తే జాలి కూడా కలుగుతుంది. 

పాకిస్తాన్ని అనేక ఏళ్ళపాటు పాలించిన జనరల్ ముషారఫ్ తన దేశ దుస్థితి చూసి ఏమాత్రం సిగ్గు, జాలిపడకుండా, దేశం ఈ దుస్థితికి చేరుకోవడానికి తనూ ఒక కారణమని భావించకుండా, తన దేశాన్ని, పాలకులని, మొత్తం వ్యవస్థనే నిందిస్తున్నారు. తను ఏ దేశం సొమ్ముతో ప్రస్తుతం లండన్ లో చాలా హాయిగా చాలా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారో అదే పాకిస్తాన్ని వేలెత్తి చూపిస్తున్నారిప్పుడు. ఇటువంటి స్వార్ధపరులైన పాలకుల కారణంగానే పాకిస్తాన్ నేడు ఈ దుస్థితికి చేరుకొంది. అక్కడి ప్రజలు తీవ్రవాదాన్ని ఒక వృత్తిగా ఉపాధి మార్గంగా ఎంచుకొని బలిదానాలు చేసుకోవలసి వస్తోంది. ఇంతకంటే దురదృష్టం ఇంకేముంటుంది? పాపం పాకిస్తాన్ ప్రజలు!


Related Post