పోలీస్ శాఖలోనే వరుస ఆత్మహత్యలా!!!

September 15, 2016


img

రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో అనేకమంది రైతులు ఆర్ధిక ఇబ్బందులు, కరెంటు కష్టాలు, సాగునీటి సమస్యలు వగైరా కారణాల చేత ఆత్మహత్యలు చేసుకొనేవారని అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యల వలన రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు చాలా తగ్గాయి. కానీ ఇప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖలో ఆత్మహత్యలు పెరగడం ప్రభుత్వాన్ని చాలా కలవరపరుస్తోంది. దీనిపై జరిపిన దర్యాప్తులో పై అధికారుల ఒత్తిళ్ళు, వేధింపులు కారణంగానే ఆత్మహత్యలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇది ప్రభుత్వానికి చాలా అప్రదిష్ట కలిగించే విషయమేనని చెప్పక తప్పదు.

ఆగస్ట్ 17వ తేదీన మెదక్ జిల్లాలో కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో సబ్-ఇనస్పెక్టర్ గా పని చేస్తున్న బి. రామకృష్ణా రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. నెలకి రూ.5 లక్షలు లంచాలు వసూలు చేసి ఇవ్వాలని తనపై అధికారులు చేస్తున్న ఒత్తిళ్ళు భరించలేకనే ఆత్మహత్య చేసుకొంటున్నట్లు సూసైడ్ నోట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. అది చాలా సంచలనం సృష్టించింది.

తాజాగా, నల్గొండలో జిల్లా లో భువనగిరి సబ్-జైలు సూపరింటెండెంట్ ఎం. శ్రీనివాస్ మొన్న మంగళవారం నుంచి కనబడకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన కూడా జైళ్ళ శాఖ డి.జి.పి. వి.కె. సింగ్ వేధింపులు భరించలేకనే వెళ్లిపోతున్నట్లు లేఖ వ్రాసి పెట్టి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఆయన వ్యవహార శైలిపై అధికారులు, ఖైదీల నుంచి కూడా చాలా ఫిర్యాదులు వచ్చేవని అందుకే ఆయనని తరచూ బదిలీ చేయవలసివచ్చేదని జైళ్ళశాఖ అధికారులు చెపుతున్నారు. అంటే ఆ కారణంగానే ఆయన తీవ్ర ఒత్తిడికి గురయినట్లు స్పష్టం అవుతోంది. వీరిద్దరే కాదు..పోలీస్ శాఖలో చాలామంది వేధింపులకి గురయిన వారున్నారు. ఆ కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్నవారున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో కెరమెరి పోలీస్ స్టేషన్ లో సబ్-ఇనస్పెక్టర్ గా పనిచేస్తున్న కె.శ్రీధర్ (27) ఆగస్ట్ 30వ తేదీన తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. అయితే ఆయన డ్యూటీలో చేరిన రెండవ రోజే ఆత్మహత్య చేసుకొన్నందున, కుటుంబ కలహాలే అందుకు కారణం అని అందరూ భావిస్తున్నారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగం నుంచి ఆక్టోపస్ విభాగానికి బదిలీ అయిన ఆర్. శివకుమార్ (25) అనే కానిస్టేబుల్ కూడా జూన్ 20న తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయన ఆత్మహత్యకి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. హైదరాబాద్ నార్త్ జోన్ లో ఖార్ఖాన పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న హన్మంత్ రెడ్డి పై అధికారుల ఒత్తిళ్ళు వేధింపులు తట్టుకోలేక కిరోసిన్ తాగి ఆత్మహత్య చేసుకోబోయారు. కానీ సకాలంలో వైద్య చికిత్స అందించడంతో బ్రతికిపోయారు. గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన రంగారెడ్డి జిల్లాలో యలాల్ పోలీస్ స్టేషన్ లో సబ్-ఇనస్పెక్టర్ గా పనిచేస్తున్న రమేష్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. కారణం మళ్ళీ అదే. ఆయనకి ఏడాది క్రితమే వివాహం జరిగింది. జూలై నెలలో డ్యూటీలో చేరారు. చేరిన మూడు నెలలకే ఒత్తిళ్ళు భరించలేక ఆత్మహత్యకి పాల్పడ్డారు.

ఇటీవల ఎన్ కౌంటర్ చేయబడిన గ్యాంగ్ స్టర్ నయీంకి చాలా మంది రాజకీయ నాయకులు, పోలీస్ శాఖలో చాలా మందితో సంబంధాలుండేవని మీడియాలో వార్తలు వచ్చాయి. దానిపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దాని దర్యాప్తులో మరికొందరి పేర్లు బయటపడితే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. కనుక నయీంతో సంబంధాలున్నవారు అందరూ తీవ్ర ఆందోళన చెందడం సహజమే. ఆ ఒత్తిడి భరించలేక మున్ముందు మరికొందరు ఆత్మహత్యలకి పాల్పడినా ఆశ్చర్యం లేదు.

పోలీస్ శాఖలో జరుగుతున్న ఇటువంటి అవాంఛనీయ పరిణామాలు ఆ శాఖకే కాదు ప్రభుత్వానికి కూడా తీరని అప్రదిష్ట కలిగిస్తాయి. కనుక ఇటువంటి వాటిని నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తక్షణమే చేపట్టడం చాలా అవసరం.


Related Post