“పాపం...పవన్ కళ్యాణ్!” ఆయన గురించి అందరూ ఇప్పుడు ఇదే అనుకొంటున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతానని ఆవేశంగా రెండు సభలు పెట్టి సాధించింది ఏమీ లేకపోయినా చేజేతులా రెండు రాష్ట్రాలలో అనేక మందిని కొత్త శత్రువులని సృష్టించుకొన్నారు. పాత శత్రువులకి తనని విమర్శించేందుకు కొత్త ఆయుధాలు అందించి వెళ్ళారు. ఆయన మద్దతు ఇచ్చిన భాజపా కూడా ఇప్పుడు ఆయనని శత్రువుగా భావిస్తూ తీవ్ర విమర్శలు చేస్తోంది. భాజపాతో సహా కాంగ్రెస్, వైకాపా, తెరాస, వామ పక్షాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాకినాడ సభతో పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరొక ముందడుగు వేస్తారనుకొంటే ఆయన మూడడుగులు వెనక్కి వేశారు.
ఆయన భాజపానే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించడం గమనిస్తే, తెదేపాని ప్రజాగ్రహం నుంచి కాపాడేందుకే దాని ప్రోత్సాహంతోనే పవన్ కళ్యాణ్ రంగంలో దిగినట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో తెదేపా ఎంపిలని కూడా సున్నితంగా విమర్శించినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎంపిలని, పార్టీ నేతలని కట్టడి చేయడంతో ఎవరూ పవన్ కళ్యాణ్ విమర్శలకి జవాబీయలేదు. అందుకే ఏపిలో ప్రతిపక్షాలు కూడా పవన్ కళ్యాణ్ వెనుక తెదేపా ఉందని గట్టిగా వాదిస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు జూ.ఎన్టీఆర్ ని వాడుకొని పులిహోరలో కరివేపాకులాగ తీసి పక్కనపడేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తెదేపాని కాపాడేందుకే పవన్ కళ్యాణ్ కాకినాడ సభ పెట్టడం నిజమైతే ఆయనపై రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆయన అభిమానులు పెట్టుకొన్న నమ్మకం పోగొట్టుకోవడం ఖాయం. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందనే పవన్ కళ్యాణ్ ఇంతవరకు చెపుతున్నారు. ఆయన అభిమానులు కూడా అదే కోరుకొంటున్నారు. కానీ ఈ విధంగా అగమ్యంగా, అనాలోచితంగా వ్యవహరించడం వలన జనసేన పట్ల ఇప్పటి నుంచే ప్రజలలో వ్యతిరేకభావం ఏర్పడే అవకాశం ఉంది.
ఒకవేళ ఆయన తెదేపాతో కలిసి సాగాలనుకొంటున్నట్లయితే అదే విషయం బహిరంగంగా ప్రకటించినట్లయితే దాని వలన ప్రజలకి, అభిమానులకి కూడా చాలా స్పష్టత ఏర్పడుతుంది. ఆయనకీ ఇటువంటి సమస్యలు, విమర్శలు ఎదుర్కొనే బాధ తప్పుతుంది. ఒకవేళ తెదేపాతో కూడా కలిసే ప్రసక్తి లేదనుకొంటే ఆ ముక్క చెప్పినా స్పష్టత వస్తుంది. తదనుగుణంగా అభిమానులు, రాజకీయ పార్టీలు ఆలోచించడం, వ్యవహరించడం మొదలుపెడతారు. కానీ ఈ విధంగా అగమ్యంగా ముందుకు సాగడం వలన ఎప్పటికప్పుడు కొత్త సమస్యలని ఆహ్వానించుకోవడం తప్పితే వేరే ప్రయోజనం ఏమీ ఉండదు.
పవన్ కళ్యాణ్ తన సొంత అనుభవాల నుంచే పాఠాలు నేర్చుకొనవసరం లేదు. తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో ఏవిధంగా తీవ్ర అప్రదిష్ట మూటగట్టుకొన్నారో చూశారు కనుక మొదటి నుంచే చాలా ఆచితూచి మాట్లాడుతూ, అడుగులు వేస్తూ ముందుకు సాగుతారని అందరూ ఆశిస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా వరుసగా తప్పటడుగులు వేస్తుండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్యాకేజి ఇచ్చిన కేంద్రం బాగానే ఉంది. పుచ్చుకొన్న తెదేపా ప్రభుత్వం కూడా బాగానే ఉంది. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ దెబ్బైపోయాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.