రాష్ట్ర విభజన తరువాత ఏపి, తెలంగాణ పరిస్థితులలో అనూహ్యమైన మార్పులు కనబడుతున్నాయి. దురదృష్టవశాత్తు ఏపి తిరోగమన దిశలో, అదృష్టవశాత్తు తెలంగాణ పురోగమన దిశలో ముందుకు సాగుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఏపిలో తెదేపా, తెలంగాణలో ప్రతిపక్షాలు అంగీకరించవని అందరికీ తెలుసు.
విభజన కారణంగా ఏపిని చుట్టుముట్టిన ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేందుకు, చాలా పొదుపుగా వ్యవహరించవలసిన తెదేపా ప్రభుత్వం తాత్కాలిక కట్టడాలు, తాత్కాలిక ప్రాజెక్టులు, విదేశీ యాత్రలు, బహిరంగ సభలపై చాలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ డబ్బు దుబారా చేస్తోంది. ఈ మాట గిట్టని వారు ఎవరో అనడం లేదు తెదేపాకి మిత్రపక్షంగా ఉన్న భాజపాయే అంటోంది. ఈ ఆర్ధిక సమస్యలకి తోడు, అవినీతి, ప్రాజెక్టుల పేరు చెప్పి బలవంతపు భూసేకరణ చేయడం, హామీల అమలులో వైఫల్యం వంటి అనేక కారణాల చేత ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందని భాజపా నేత పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక హోదా, ఓటుకి నోటు కేసు మొదలైన వ్యవహారాలలో ప్రభుత్వం పట్ల ప్రతిపక్షాలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నాయి. అంటే ప్రభుత్వం పట్ల ప్రజలు, మిత్రపక్షం, ప్రతిపక్షాలు అందరూ ఎంతో కొంత వ్యతిరేకత కలిగి ఉన్నారని అర్ధం అవుతోంది. వీటన్నిటికీ తోడూ మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ కోసం ఉద్యమాలు మొదలయ్యాయి. తెదేపా, భాజపాలకి మిత్రుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఉద్యమాలకి సిద్ధమవుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏపి అగమ్యగోచరంగా సాగిపోతున్నట్లు అనిపిస్తోంది.
అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిందించక తప్పదు. ఆయన అనుభవం, కార్యదక్షత, మోడీతో ఉన్న సాన్నిహిత్యం వంటివన్నీ చూసే ఆయనైతేనే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెడతారనే నమ్మకంతో ప్రజలు ఆయనకి అధికారం కట్టబెట్టారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులని చూస్తుంటే ఆయన ఆ నమ్మకం నిలబెట్టుకోలేకపోయారనిపిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం సహకారం కొరవడటం, ఆర్ధిక సమస్యలు కూడా కారణమేనని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రత్యేక ప్యాకేజి అయినా ఇచ్చి ఉండి ఉంటే ఈ సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందేమో?
ఇక తెలంగాణ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి కెసిఆర్ హుస్సేన్ సాగర్ చుట్టూ గాలిమేడలు కట్టడం, నూతన సచివాలయ నిర్మాణం, ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేయాలనుకోవడం, హైదరాబాద్ లో స్కైవేలు, హైవేలు, దేశంలోకెల్లా పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకోవడం, దళితులకి మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు, పంట రుణాల మాఫీ వంటి అనేక రంగుల కలలని ప్రజలకి చూపిస్తున్నప్పటికీ, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, పారిశ్రామికాభివృద్ధి వంటి లక్ష్యాలని ఎన్నడూ మరిచిపోకుండా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నందున ఆ రంగాలలో అభివృద్ధి కళ్ళకి కనబడటం మొదలైంది.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ వాటిలో పురోగతి కనబడింది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ఒప్పుకోకపోయినప్పటికీ కేంద్రప్రభుత్వం, దేశంలో అనేక ఇతర రాష్ట్రాలు గుర్తించాయి. అదే విధంగా కేంద్రం సహాయంతో రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి కూడా గట్టెక్కించగలిగారు. రామగుండంతో సహా రాష్ట్రంలో చేపట్టిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం పూర్తయితే కెసిఆర్ చెప్పినట్లుగా రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించడం ఖాయం.
కెసిఆర్ కి అత్యంత ప్రీతిపాత్రమైన సాగునీటి ప్రాజెక్టులలో కూడా మంచి పురోగతి కనబడుతోంది. ఇవాళే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పధకంలో భాగంగా ఏర్పాటు చేయబడ్డ రెండు లిఫ్టింగ్ పంపులు, మంత్రి హరీష్ రావు ప్రారంభించి పాలమూరు భూములకి నీళ్ళు పారించి చూపారు. వీటి ద్వారా సుమారు లక్ష ఎకరాలకి నీళ్ళు అందుతాయి. మిగిలిన 9 పంపులు కూడా ఈ ఏడాది నవంబర్ నాటికి సిద్ధమవుతాయి. అన్నీ పనిచేయడం మొదలుపెడితే జిల్లాలో 3.16 లక్షల ఎకరాలకి నీళ్ళు అందుతాయి.
ఉన్నత విద్యావంతుడైన మంత్రి కెటిఆర్, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అవరోధంగా ఉన్న నియమనిబంధనలని తొలగించి, చాలా సంస్కరణలు అమలు చేయడం వలన రాష్ట్రానికి అనేక దేశవిదేశీ సంస్థలు, పరిశ్రమలు తరలివస్తున్నాయి. ముఖ్యంగా ఐటి రంగంలో అభివృద్ధి ఇంకా వేగం పుంజుకొంది. అయితే ప్రపంచ దేశాలు ఎటువంటి ఒడిడుకులకి లోనయినప్పటికీ వాటిని తట్టుకొని నిలబడే విధంగా ఐటి, పారిశ్రామిక రంగాలని తీర్చిదిద్దడం కూడా చాలా అవసరం. ఐటి పరిశ్రమ ద్వారా వేగంగా, భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, నిలకడగా ఆదాయం అందించగల ఉత్పత్తి రంగంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే బాగుంటుంది.
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించే అవకాశాలు కనబడుతుంటే, ప్రస్తుతం ఆంధ్రా లో నెలకొని ఉన్న ఆర్ధిక సమస్యలు, కలుషిత రాజకీయ వాతావరణం వలన రాష్ట్ర పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి.