కొత్త పార్లమెంటు భవనం విశేషాలు

December 10, 2020


img

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వినియోగిస్తున్న పార్లమెంటు భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. కనుక అత్యాధునిక సదుపాయాలతో పాత పార్లమెంటు భవనం ఎదుటే మరో కొత్త పార్లమెంటు భవనం నిర్మించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.  సెంట్రల్ విస్తాగా పేర్కొనబడుతున్న ఈ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ్ళ మధ్యాహ్నం శంఖుస్థాపన చేయనున్నారు. సెంట్రల్ విస్తాకు సంబందించిన పూర్తి వివరాలు: 

నిర్మాణం: 

కొత్త పార్లమెంటు భవనానికి గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ కంపెనీ డిజైన్ చేయగా, టాటా కంపెనీ ఈ భవనాలను నిర్మించబోతోంది. రూ.861.90 కోట్లు వ్యయంతో దీనిని నిర్మించబోతున్నారు. భారత్‌ 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంవత్సరమైన 2022 నాటికి ఈ కొత్త భవనం నిర్మాణం పూర్తిచేసి 2022 అక్టోబర్‌లో ఈ కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు జరపాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. కనుక ఆ గడువులోగా నిర్మాణం పూర్తిచేయవలసి ఉంటుంది.     

విస్తీర్ణం: 

పాత పార్లమెంటు భవనం కంటే కొత్తది 17,000 చదరపు మీటర్లు విస్తీర్ణం అదనంగా ఉండేలా నిర్మిస్తున్నారు. కానీ ఎత్తు మాత్రం పాత భవనం అంతే ఉండేలా నిర్మిస్తున్నారు. మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో త్రిభుజాకారంలో నిర్మించబడుతుంది. దీనిలో బేస్‌మెంట్, గ్రౌండ్ కాకుండా మరో రెండు అంతస్తులు ఉంటాయి. భారీ భూకంపాలను సైతం తట్టుకొనేలా నిర్మాణం ఉంటుంది. 

ఈ కొత్త భవనానికి కొద్ది దూరంలో ఎంపీల కార్యాలయాల కోసం మరో భవనం నిర్మించబడుతుంది. అక్కడి నుంచి ఎంపీలు నేరుగా కొత్త పార్లమెంటు భవనంలోకి చేరుకొనేందుకు వీలుగా సొరంగమార్గం ఏర్పాటు చేయబడుతుంది. అత్యవసర సమయంలో పార్లమెంటులో నుంచి బయటకు వెళ్ళిపోయేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. 

వినియోగం: 

లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కలిపి మొత్తం 1,224 మంది ఎంపీలు కూర్చొనేలా నిర్మించబడుతుంది. దీనిలోనే ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, స్పీకర్, డెప్యూటీ స్పీకర్, పార్లమెంట్ నిర్వాహక అధికారులు, ఉద్యోగులు, సెక్యూరిటీ తదితర 120 కార్యాలయాలు ఉంటాయి. 

సమీపంలోనే కొత్తగా కేంద్ర సచివాలయ భవనం కూడా నిర్మించబడుతుంది. దీనిని మార్చి 2024నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. దీని నిర్మాణం పూర్తయిన తరువాత నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లను మ్యూజియంగా మార్చబడతాయి.



Related Post