కాశ్మీర్ వేర్పాటువాదులపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో ఊహించగలరా?

September 01, 2016


img

‘కాశ్మీర్ వేర్పాటువాదులు’ అంటేనే వారు ఎవరో..ఏమి చేస్తుంటారో అర్ధం అవుతుంది. భారతదేశం నుంచి కాశ్మీర్ ని విడదీసి పాకిస్తాన్ లో కలపడానికి వారు అనేక దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. అటువంటి వేర్పాటువాదుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తాయనుకొంటాము? వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  కఠినమైన ఆంక్షలు, నిఘా పెడతాయని ఆశిస్తాము. కానీ వారినందరినీ కొత్త అల్లుళ్ళలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలు తరబడి పోషిస్తున్నాయని తెలిస్తే షాక్ అవకుండా ఉండలేము.

వేర్పాటువాదులలో బాగా పేరున్న సంస్థ హురియత్ కాన్ఫరెన్స్. దాని అధినేత సయ్యద్ అలీ షా గిలానీ, దానిలో సభ్యులు మీర్వాయిజ్ ఫరూఖ్, యాసిన్ మాలిక్‌ వంటివారు చాలా మంది ఉన్నారు. వారందరికీ ఏటా విదేశీ యాత్రలు చేసేందుకు, విమాన ప్రయాణ ఖర్చులు, స్టార్ హోటళ్ళలో వసతి, టాక్సీలు, ఆహారం, ఫోన్ బిల్లులు వగైరా వగైరా అన్నీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రూ. 100 కోట్లు ఖర్చు చేస్తోందట! అందులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం, 10శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయిట! ఆ ఖర్చులు కాకుండా, వారికి భద్రత కల్పించేందుకు మొత్తం 950 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారట! అంటే అవి కూడా కలిపి చూసుకొంటే వారిపై కనీసం ఏటా రూ.200 కోట్లు ఖర్చు చేస్తుండవచ్చని స్పష్టం అవుతోంది.

ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ఏ భారతీయుడికి దక్కని ఆ విలాసవంతమైన జీవితం భారత్ నుంచి కాశ్మీర్ నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తున్న వేర్పాటువాదులకి దక్కుతోందన్నమాట! దేశం కోసం సరిహద్దులలో సియాచిన్ మంచు కొండల మీద ప్రాణాలకి తెగించి పహారా కాస్తున్న సైనికులకి కూడా ఇంత అదృష్టం దక్కదేమో? కానీ వేర్పాటువాదులకి దక్కుతోంది.

వేర్పాటువాదుల నాయకుడు గిలానీకి ఇటీవల గుండె పోటు వస్తే, ఆయనని ప్రత్యేక విమానంలో హుటాహుటిన ఢిల్లీకి తరలించి ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించి ప్రాణాలు కాపాడింది భారత ప్రభుత్వం. కానీ ఆయన కొన్ని రోజుల క్రితం కాశ్మీర్ గోడల మీద “ఇండియా గో బ్యాక్” అని నినాదాలు రాశారు. భారత ప్రజలు చెమటోడ్చి కష్టపడి సంపాదించి కడుతున్న పన్నులతో అటువంటి వేర్పాటువాదులకి భారత ప్రభుత్వం సకల భోగాలు అమర్చిపెడుతోంది. భారత ప్రభుత్వం దేశ ప్రజలందరి దగ్గర ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తుంటే, వేర్పాటువాదులు దాని దగ్గర నుంచే ఈ విధంగా కప్పం కట్టించుకొంటున్నట్లు భావించవచ్చు.

నేటికీ వారందరూ ఈ సకల రాజభోగాలు అనుభవిస్తూనే ఉన్నారు. బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్  తరువాత కాశ్మీర్ లో చెలరేగిన అల్లర్లని ఈ వేర్పాటువాదులు అందరూ వెనుక నుండి ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఇక నుంచి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చులని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొన్నట్లు తాజా సమాచారం. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇకపై డబ్బు ఖర్చు చేయవద్దని లేఖ వ్రాసినట్లు తెలుస్తోంది. అసలు ఇంతకాలం వాళ్ళని పోషించడమే చాలా తప్పు. అది నాగుపాముకి పాలు పోసి పెంచినట్లేనని కాశ్మీర్ అల్లర్లలో వారే స్వయంగా నిరూపింఛి చూపారు. కనుక ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొనడం హర్షణీయమే.


Related Post