ఒలింపిక్స్ లో పథకాలు సాధించినందుకు సింధూ, సాక్షి మాలిక్ లకి అనేక రాష్ట్రాలు, వ్యాపార సంస్థల వారు ఎన్నడూ ఊహించలేనంత భారీ బహుమానాలు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సింధూకి మొదట కోటి రూపాయలు బహుమానంగా ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవరూ ఊహించనంతగా, ఏకంగా రూ.5కోట్లు నగదు, హైదరాబాద్ లో 1,000 గజాల స్థలం, ప్రభుత్వోద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఆమెకి అంత అద్భుతమైన శిక్షణ ఇచ్చినందుకు ఆమె కోచ్ గోపీ చంద్ కి కూడా కోటి రూపాయలు బహుమానం ప్రకటించారు. రెజ్లింగ్ లో కాంస్య పథకం సాధించిన సాక్షి మాలిక్ కి కూడా కోటి రూపాయలు నగదు బహుమానం ప్రకటించారు. ఇంకా అనేక రాష్ట్రాలు, సంస్థలు బహుమానాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఆ జాబితాని రాయడం మొదలుపెడితే చిన్న సైజు పుస్తకమే అవుతుంది.
భారత్ కి గర్వ కారణం అయిన వారిరువురినీ గొప్పగా సత్కరించడం చాలా హర్షించవలసిన విషయమే. అయితే ఇక్కడే అందరూ కొంత ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇంత ఉన్నత శిఖరాలు చేరుకొనేందుకు సింధూ, సాక్షి మాలిక్ పడిన కష్టనష్టాలు, బాధలు, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రభుత్వాలకి కూడా తెలుసు. నేటికీ దేశంలో సరిగ్గా అటువంటి సమస్యలనే ఎదుర్కొంటున్న నిరుపేద క్రీడాకారులు కొన్ని వేలమంది ఉన్నారు. ప్రభుత్వాలకి మట్టిలో మాణిక్యాలని వెలికితీసే ఓపిక, శ్రద్ధ, చిత్తశుద్ధి ఉన్నట్లయితే కొన్ని లక్షల మంది సింధులు, సాక్షి మాలిక్ లు కనబడతారు.
క్రీడలలో ఆసక్తి, ప్రతిభ ఉన్నా పేదరికం కారణంగా ఆడలేకపోతున్నవారు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ కారణంగా వారిని స్వయంగా తల్లితండ్రులే ప్రోత్సహించలేని దయనీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక అటువంటి వారిని చుట్టూ ఉన్న సమాజం, ప్రభుత్వాలు ఏమి ఆదరిస్తాయి? వారి ప్రతిభని ఎలా గుర్తిస్తాయి? కడుపు నిండా తిండి, ఆదరణ, ప్రోత్సాహం, సహాయ సహకారాలు, సౌకర్యాలు, శిక్షణ కోసం ఎదురుచూస్తున్న ప్రతిభ గల నిరుపేద క్రీడాకారులు మన దేశంలో ఏ మూలకి వెళ్ళినా కనబడుతూనే ఉంటారు.
కనుక సింధూ, సాక్షి మాలిక్ లకి సముచితమైన బహుమానాలు ఇచ్చి గౌరవిస్తూనే, వారికి ఇవ్వదలచుకొన్న దానిలో అధిక శాతాన్ని ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న అటువంటి ఔత్సాహిక క్రీడాకారులకి అవసరమైన సహాయ సహకారాలు, సదుపాయాలు, శిక్షణ వంటివి కల్పించినట్లయితే ఆ డబ్బు పూర్తిగా సద్వినియోగమవుతుంది. ఇప్పుడు సమున్నత స్థాయికి చేరుకొన్న సింధూ, సాక్షి మీనన్ ల కంటే ప్రతిభావంతులైన నిరుపేద క్రీడాకారులకి అందరూ సహాయ సహకారాలు అందించడం వలన దేశానికి చాలా మేలు కలుగుతుంది. అప్పుడు భారత్ లో అనేక మంది సింధులు, సాక్షి మాలిక్ లు తయారవుతారు.
ఆంధ్రప్రదేశ్ బిజెపి యువమోర్చ అధ్యక్షుడు విష్ణు కూడా ఇంచుమించు ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. క్రీడాకారులకి ప్రభుత్వాలు చాలా ఆర్భాటంగా నజరానాలు ప్రకటించడమే కాకుండా, వాటిని వారికి అందజేయడంలోనూ చిత్తశుద్ధి చూపించుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు పోటీపడి క్రీడాకారులకి భారీ నజరానాలు ప్రకటించడం కంటే క్రీడలను ప్రోత్సహించాలని, అందుకోసం మంచి శిక్షణ సౌకర్యాలు, ప్రోత్సాహకాలు సమకూర్చాలని సూచించారు. అప్పుడే పథకాలు సాధించగలిగే మేటి క్రీడాకారులని తయారుచేసుకోగలమని విష్ణు అన్నారు.