దేశభక్తి మనసులోనే కాదు చేతల్లో కూడా కనబడాలి.

August 14, 2016


img

కులమతాలు, బాషాప్రాంతాలకి అతీతంగా భారతీయులు అందరూ జరుపుకొనే పండుగ జెండా పండుగ ఈరోజే. కాశ్మీరు నుంచి కాకపోయినా కన్యాకుమారి వరకు దేశమంతటా మువన్నెల జెండా ఠీవిగా రెపరెపలాడుతుంటే, అది చూసి గర్వంతో, సంతోషంతో పొంగిపోని భారతీయుడు ఉండడు. స్వాత్రంత్ర్యం కోసం నేటి తరం పోరాడలేకపోయుండవచ్చు కానీ ఆ త్యాగధనుల దయతో సిద్ధించిన  ఈ స్వాతంత్ర్యానికి పూర్తి న్యాయం చేస్తూ దేశాభివృద్ధికి అందరూ తలో చెయ్యి వేస్తూనే ఉన్నారు. విద్యా, వైద్య, వర్తక, పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాలలో భారత్ అగ్రదేశాలతో నేడు పోటీ పడే దశకు చేరుకొందంటే అది భారతీయుల సమిష్టి కృషే. ఈ ఏడు దశాబ్దాలలో మనమెంత ప్రగతి సాధించామో తెలుసుకోవాలంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొంటే అర్ధం అవుతుంది. లేదా మనతో బాటే స్వాతంత్ర్యం పొందిన పాకిస్తాతో పోల్చి చూసుకొంటే ఇంకా బాగా అర్ధం అవుతుంది.

ఈ ఏడు దశాబ్దాలలో భారత్ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. నిజమే..నూటికి నూరు పాళ్ళు నిజమే. అయితే మన రాజకీయ నాయకులలో మరికాస్త తపన, చిత్తశుద్ధి, నిజాయితీ ఉండి ఉంటే మన దేశం ఇప్పుడు సాధించిన దానికి మూడు రెట్లు ఎక్కువగా అభివృద్ధి సాధించి ఉండేది. అప్పుడు అగ్రరాజ్యాల ప్రజలే మనదేశంలో ఉద్యోగాల కోసం వస్తూ ఉండేవారు. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ని డాలర్ కాక మన రూపాయే శాశించి ఉండేదేమో? కానీ ఆరోజు కూడా ఇక ఎంతో దూరం లేదనే అనిపిస్తోంది.

భారతీయులు అందరిలో దేశభక్తి, కష్టపడే గుణం, తెలివితేటలు అన్నీ  పుష్కలంగా ఉన్నాయి. దేశం నిండా అపారమయిన సహజవనరులు ఉన్నాయి. ఇప్పుడు కావలసినదల్లా వాటిని సమర్ధంగా దేశం కోసం వినియోగించుకోవడమే. అందుకు దేశప్రజలు అందరూ సిద్దంగానే ఉన్నారు కానీ మన భ్రష్ట స్వార్ధ రాజకీయాలు, నేతలే దేశాభివృద్ధికి “బాటిల్ నెక్” గా అవరోధంగా నిలుస్తున్నారు. దేశభక్తి, తెలివితేటలు, సమర్ధత కలిగిన ఉన్నత విద్యావంతులు అందరూ ఆ కుళ్ళు రాజకీయాలని చూసి అసహ్యించుకొంటూ, రాజకీయాలకి దూరంగా ఉండటం వలన నేరచరిత గల అవినీతి రాజకీయ నేతల చేతికి దేశాన్నిఅప్పగించి దోచుకోవడానికి ప్రజాస్వామ్య లైసెన్స్ ని మంజూరు చేస్తున్నామమే సంగతి విస్మరిస్తున్నారు.

దేశాభివృద్ధి అంటే పారిశ్రామిక, ఆర్ధికఅభివృద్ధి, లేదా అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా కాంక్రీట్ జంగిల్స్ నిర్మించుకోవడమే కాదు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతీ నగరం, పట్టణం, గ్రామంలో ప్రజల జీవనప్రమాణాలు పెరగాలి. డిల్లీ నగరంలో కనబడే అభివృద్ధి దేశంలో మారు మూల గ్రామాలలో కూడా ప్రతిబింబించాలి. అందరికీ ఆహారం, ఆరోగ్యం, విద్యా, వైద్యం, సుఖ సంతోషాలు లభించాలి. మళ్ళీ దేశంలో పచ్చదనంతో కళకళలాడాలి. అప్పుడే మన స్వాత్రంత్ర్యానికి పూర్తి సంపూర్ణత ఏర్పడుతుంది. ఈ అభివృద్ధికి ‘బాటిల్ నెక్’ ఎక్కడ ఏర్పడిందో అందరికీ తెలుసు కనుక దేశంలో యువత దానిని క్లియర్ చేసేందుకు చొరవ తీసుకోవలసిందే.

ఒకప్పుడు స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం తమ ప్రాణాలు కూడా అర్పించారు. ఇప్పుడు దేశానికి ఎవరి ప్రాణాలు అవసరం లేదు. తనకి నిజంగా దేశభక్తి ఉందని నమ్మే ప్రతీ భారతీయుడు తనకున్న ఆర్దికశక్తి, విజ్ఞానం, మేధసు, శక్తి యుక్తులలో కొద్దిగా దేశానికి కేటాయిస్తే చాలు.

దేశంలో ఒక్క నిరుపేద జీవితంలో వెలుగులు నింపినా చాలు. ఒక్క నిరుపేద విద్యార్ధికి అండగా నిలబడినా చాలు. అందరూ చేతులు కలిపితే నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య తీర్చలేమా? సిరిసిల్ల చేనేతన్నల కన్నీళ్లు తుడవలేమా? పేదరికం కారణంగా తీవ్రవ్యాదులతో మంచాన్న పడి ఆపన్నహస్తాల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకి, పసిపిల్లల కోసం మనమేమీ చేయలేమా? కన్నతల్లి వంటి మన ఊరుకి మనమేమీ చేయలేమా? అని ప్రతీ ఒక్కరు ఆలోచించాలి.

సోషల్ నెట్ వర్క్ ద్వారా వందలువేలమంది చేతులు కలిపి సినిమాలు, పనికిమాలిన రాజకీయాల గురించి మాట్లాడుకోవడం కంటే ఆ సమిష్టిశక్తిని ఇటువంటి పనులకి ఉపయోగించుకోలేమా? సమస్యలని గుర్తించి, వాటికి పరిష్కారం కనుగొనలేమా? యువత ఆలోచించాలి. ఠీవిగా రెపరెపలాడుతున్న మువన్నెల జెండాని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. జేబుకి మువ్వన్నెల జెండా పిన్ చేసుకొని తిరిగితే ఏదో చెప్పలేని తృప్తి కలుగవచ్చు. దేశం కోసం చేసే ఇటువంటి చిన్న చిన్న పనుల వలన అంతకంటే ఎక్కువే సంతృప్తి, ఆనందం పొందవచ్చు. నాకు చాలా దేశభక్తి ఉందనుకొంటే సరిపోదు. “ఐ లవ్ ఇండియా” అని కారుకి స్టిక్కరు అంటించుకొని తిరిగితే సరిపోదు. అది నిరూపించుకోవడం కూడా చాలా అవసరం. కనుక రండి అందరూ చేతులు కలుపుదాము. దానికి “మై తెలంగాణ” వేదిక కావడానికి సిద్దంగా ఉంది.

జై హింద్!  


Related Post