చంద్రబాబుకి ఎన్టీఆర్ జ్ఞాపకం వచ్చింది అందుకేనా?

August 13, 2016


img

పులిహోరలో కరివేపాకు వేయడం చాలా అవసరమే కానీ దానిని తినేటప్పుడు తీసి పక్కన పడేస్తాము. ఏపి సిఎం చంద్రబాబు కూడా చాలా మందిని అలాగే పులిహోరలో కరివేపాకు లాగా వాడుకొని పక్కన పడేస్తుంటారు. ఆ జాబితాలో సీనియర్ ఎన్టీఆర్ మొదలు జూ.ఎన్టీఆర్ వరకు చాలా మందే ఉన్నారు. కానీ మొన్న హఠాత్తుగా మళ్ళీ జూ.ఎన్టీఆర్ గుర్తొచ్చాడు ఆయనకి. వెంటనే తన మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని పంపించి జూ.ఎన్టీఆర్ ని కృష్ణా పుష్కరాలకి ఆహ్వానించారు.

2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ తన తాతని తలపిస్తూ ఖాకీ డ్రెస్ వేసుకొనొచ్చి, గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుంటే జనాలు ఫ్లాట్ అయిపోయారు. అప్పటి నుంచి తెదేపాకి అసలైన వారసుడు జూ.ఎన్టీఆర్ అనే అభిప్రాయం వినపడటం మొదలయ్యేసరికి, నారా లోకేష్ ని తన వారసుడిగా చేయాలనుకొంటున్న చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఎన్టీఆర్ ని మెల్లగా పార్టీ నుంచి దూరం చేశారు. ఆ తరువాత 2014 ఎన్నికలలో, అమరావతి శంఖుస్థాపనకి, గోదావరి పుష్కరాలకి, మహానాడు సమావేశాలకి కూడా ఎన్టీఆర్ ని దూరంగా పెట్టారు. ఇప్పుడు హఠాత్తుగా జూనియర్ ని గుర్తు చేసుకావడంతో సహజంగానే ఊహాగానాలు, అనుమానాలు మొదలయ్యాయి.

టిడిపి, బిజెపిల స్నేహం తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారయింది. ప్రత్యేక హోదా అంటూ జగన్ చేస్తున్న హడావుడి కారణంగా ఆ రెండు పార్టీల పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోంది. కనుక ఆ భయంతో ఒకవేళ బిజెపితో కటీఫ్ చెప్పేసుకొంటే దానిని, వైసిపిని, కాంగ్రెస్ పార్టీలని కూడా టిడిపి ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ పత్తాలేకుండా పోయాడు. కానీ వచ్చే ఎన్నికలలో జనసేనతో బరిలో దిగుతానని చెపుతున్నాడు. దిగితే వాటితో బాటు ఆయన సైన్యాన్ని కూడా టిడిపి ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీకి దిగకపోయినా టిడిపికి మద్దతు ఇస్తాడో లేదో తెలియదు. వీరందరూ కాకుండా ముద్రగడ పద్మనాభం అనే మరో కొత్త శత్రువు కూడా పుట్టుకొచ్చాడు. ఆయన టిడిపి కాపు ఓటు బ్యాంక్ ని ఒక పద్ధతి ప్రకారం జగన్ వైపు డైవర్ట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే వచ్చే ఎన్నికలలో టిడిపి వారందరినీ ఒంటరిగా ఢీ కొని గెలవాల్సి ఉంటుంది.

పంటరుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ, బాబోస్తే జాబు, నిరుద్యోగ భ్రుతి, సింగపూర్ లాంటి రాజధాని నిర్మాణం, పోలవరం, మెట్రో రైళ్ళు ఇలా చాంతాడంత లిస్టు ఉన్న హామీలలో సగం అయినా చంద్రబాబు అమలు చేసి ఉంటే జనాలు కన్సిడర్ చేసేవారేమో. కానీ ఆయన ఆ హామీలన్నీ మరిచిపోయినా జనాలు మాత్రం మరిచిపోలేదు. వారు మరిచిపోవాలనుకొన్నా జగన్ మరిచిపోనివ్వడం లేదు. కనుక వచ్చే ఎన్నికలలో టిడిపికి అంతా వ్యతిరేక వాతావరణమే కనిపిస్తోంది. అందుకే చంద్రబాబుకి మళ్ళీ జూ.ఎన్టీఆర్ యాదికొచ్చాడేమో.


Related Post