పవన్ కళ్యాణ్ ప్రశ్నించడు కానీ..

August 10, 2016


img

ఏపిలో ప్రత్యేక హోదాపై సాగుతున్న రాజకీయ చదరంగంలో రాజకీయ నేతలు దాని నుంచి పూర్తి రాజకీయ మైలేజ్ పొందుతుంటే, వారి ఆటలో పావులుగా మారిన మునికోటి వంటి సామాన్య కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకొన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపిలో ఘోరంగా దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకోవడానికి ఆ పార్టీ నేతలు ప్రత్యేక హోదా అంశాన్ని చాలా చక్కగా వాడుకొంటున్నారు.

గత ఏడాది దాని కోసం తిరుపతిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకే చెందిన మునికోటి అనే ఒక సామాన్య కార్యకర్త ఒంటికి నిప్పు పెట్టుకొని బలిదానం చేసుకొన్నాడు. ఆ తరువాత ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు అతని శవాన్ని స్వయంగా మోసి అంత్యక్రియలు పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అ తరువాత మళ్ళీ వాళ్ళు అతని కుటుంబాన్ని పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్న వైకాపా నేతలు గానీ, మేరె ఇతర నాయకులు, చివరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. 

కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పట్టించుకొన్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రతినిధి మారిశెట్టి రాఘవయ్య ద్వారా మునికోటి భార్య దాక్షాయణి, అతని తమ్ముడు మురళికి రూ.5 లక్షలు చెక్ అందజేశారు. ప్రత్యేక హోదా కోసం మునికోటి చేసిన త్యాగాన్ని ఎన్నటికీ మరిచిపోలేమని పవన్ కళ్యాణ్ మాటగా చెప్పారు.

ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నించడం లేదని, నిలదీయడం లేదని ప్రతిపక్షాలు ఆయనని తరచూ విమర్శిస్తుంటాయి. మరి నిత్యపోరాటం చేసే ప్రతిపక్షాలు ఏం సాధించగలిగాయి అంటే ఏమీ లేదని కనబడుతోంది. కానీ వాళ్ళు ఆడుకొంటున్న ఈ ప్రత్యేక రాజకీయ చదరంగంలో మునికోటి వంటి అమాయకులు పావులుగా మారి ప్రాణాలు కోల్పోయారు. అంత త్యాగం చేసినా పట్టించుకోని రాజకీయ పార్టీలు నిజంగా ప్రజల కోసమే పోరాడుతున్నాయంటే నమ్మశక్యంగా ఉందా? పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించకపోవచ్చు, కానీ దాని కోసం పోరాడిన వారిని మరిచిపోకుండా ఆదుకొన్నాడు. పవన్ కళ్యాణ్ కి మిగిలిన నేతలకి మధ్య ఉన్న  తేడా అదే! అందుకే పవన్ కళ్యాణ్ మాట్లాడకపోయినా ప్రజలలో ఆయనకి అంత విలువ గౌరవం ఉన్నాయి. 


Related Post