ప్రతిపక్షనేతగా మారిన చంద్రబాబు

May 29, 2019


img

కర్ణుడి చావుకు వెయ్యి శాపాలు...కారాణాలన్నట్లు ఏపీలో టిడిపి ఓటమికి కూడా అన్ని ఉన్నాయి. “40 ఏళ్ళ రాజకీయ అనుభవంతో చెపుతున్నా.. టిడిపి 110 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది,” అని చెప్పిన చంద్రబాబునాయుడు కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకొని ప్రతిపక్ష బెంచీలలో కూర్చోవడానికి సిద్దపడుతున్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో బుదవారం టిడిపి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. టిడిపి ఎమ్మెల్యేలు ఆయనను టిడిపి శాసనసభ పక్షనేతగా ఎన్నుకొన్నారు. 

తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా నడిపించడం జగన్‌కు ఎంత కష్టమో, తనకంటే వయసులో, అనుభవంలో చిన్నవారైన జగన్‌మోహన్‌రెడ్డిని, వైసీపీ ఎమ్మెల్యేలను శాసనసభలో ఎదుర్కోవడం చంద్రబాబునాయుడుకి కూడా అంతే కష్టం. గత శాసనసభలో టిడిపి ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న వైసీపీ ఎమ్మెల్యేలు వారిపై పగతో రగిలిపోతున్నారు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం. టిడిపి హయంలో రాజధాని కోసం భూసేకరణ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనులలో జరిగిన అవినీతిని వెలికితీయాలని జగన్ భావిస్తున్నారు. కనుక చంద్రబాబుతో సహా మాజీ మంత్రులకు శాసనసభలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. ఈ నేపధ్యంలో టిడిపి శాసనసభాపక్షనేతగా పనిచేయడం కత్తిమీద సామువంటిదే. 

మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్‌ శాసనసభకు వెళ్ళనవసరం లేదు కనుక అవమానాలు ఎదుర్కోనవసరం లేదు కానీ అవినీతి కేసులలో చిక్కుకొనే అవకాశం కనిపిస్తోంది.


Related Post