ఢిల్లీ ప్రేలుడు ఆత్మాహుతి దాడేనా?

November 11, 2025
img

నిన్న ఢిల్లీలో జరిగిన కారు బాంబు ప్రేలుడు ఘటనకు సంబంధించి మెల్లమెల్లగా కొత్త విషయాలు బయటపడుతున్నాయి. 

ఫరీదాబాద్‌కు చెందిన డా.ఒమర్ మహ్మద్ అనే వైద్యుడు ఆ కారుని కాశ్మీర్‌లోని పుల్వామాలో ఓ వ్యక్తి దగ్గర నుంచి కొంతకాలం క్రితం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆ కారులో ప్రేలుడు పదార్ధాలు నింపుకొని ఎర్రకోట మెట్రో స్టేషన్‌ వద్ద మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సుమారు 3 గంటలు సేపు ఉన్నారు. అంతసేపు అతను ఆ కారులో నుంచి బయటకు రాలేదు. 

సాయంత్రం సుమారు 6.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరినట్లు సీసీ కెమెరా రికార్డింగుల ద్వారా గుర్తించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్‌ లైట్ పడినప్పుడు కారులో ఈ భారీ విస్పోటనం జరిగింది. 

కనుక ఇది ఖచ్చితంగా ఆత్మాహుతి దాడి లేదా ఇంకా రద్దీగా ఉండే ప్రాంతానికి చేరుకుని అక్కడ ప్రేలుడు జరిపేందుకు వెళుతున్న సమయంలో పొరపాటున ఈ ప్రేలుడు జరిగి ఉండవచ్చని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. 

ఈ ప్రేలుడులో 10 మంది ఘటనా స్థలంలోనే చనిపోగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రేలుడు ధాటికి పకనున్న కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. కొద్ది దూరంలో ఉన్న కార్లు, ఇళ్ళ కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయి. జాతీయ నిఘా సంస్థ బృందాలు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే లభించిన సమాచారం ప్రకారం ఫరీదాబాద్, కాశ్మీర్‌లో కొందరిని అరెస్ట్‌ చేసి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.


Related Post