బస్సులో మరో అగ్ని ప్రమాదం... అందరూ సేఫ్!

November 11, 2025
img

ఇటీవల వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలులో జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది సజీవ దహనం కాగా, రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 9 మంది మరణించారు. తాజాగా ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి నెల్లూరు బయలుదేరిన విహారీ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సులో అగ్ని ప్రమాదం జరిగి క్షణాలలో కాలి దగ్ధమైంది. 

బస్సు నల్గొండ జిల్లాలో చిట్యాల మండలంలోని వెలిమినేడు వద్దకు చేరుకున్నప్పుడు ఇంజన్‌లో నుంచి పొగలు మొదలయ్యాయి. వెంటనే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోవాలని కేకలు వేశాడు. దాంతో ప్రయాణికులు ఎమర్జన్సీ డోర్‌ నుంచి బయటకు వచ్చేశారు. మిగిలినవారు కిటికీ అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి  ప్రాణాలు కాపాడుకున్నారు. 

వారు బయటపడి చూస్తుండగానే క్షణాలలో మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. క్షణాలలో బస్సు మంటలలో కాలి దగ్ధమైపోయింది. 

డ్రైవర్ వెంటనే ప్రమాదాన్ని శంకించి బస్సుని నిలిపివేసి ప్రయాణికులను దిగిపోవలసిందిగా గట్టిగా హెచ్చరించడంతో అందరూ త్రుటిలో ప్రాణాలతో బయటపడగలిగారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులున్నారు. 

ఇంజన్‌ ఉండే ప్రదేశంలో షార్ట్ సర్క్యూట్ జరగడం వలన ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Related Post