అందెశ్రీ ఇక లేరు.. పోలీస్ లాంఛనాలతో నేడు అంత్యక్రియలు!

November 11, 2025
img

ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీ ఇక లేరు. సోమవారం ఉదయం లాలాపేటలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల సిఎం రేవంత్ రెడ్డి, అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు, పలువురు సాహిత్యవేత్తలు, కళాకారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణ సాహితీ దిగ్గజాలలో ఒకరైన అందెశ్రీ (అందె ఎల్లయ్య) స్వస్థలం సిద్ధిపేట జిల్లాలోని మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామం. పేదరికం కారణంగా చదువుకోలేక బాల్యంలోనే గొర్రెల కాపరిగా ఆ తర్వాత భవన కార్మికుడుగా అందెశ్రీ దుర్భర జీవితం గడిపారు. 

కానీ బాల్యం నుండే ఆయనలో కవి పాటల రూపంలో బయటకు వచ్చాడు. సమాజంలో జరుగుతున్న ఘటనలు, పరిణామాలపై కవితారూపంలో తన భావాలు వ్యక్తీకరించేవారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో ‘మాయమైపోతున్నాడమ్మా...’ గీతంతో మంచి గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీ తన కవితలు, పాటలతో ప్రజలను ఉత్తేజ పరిచారు. ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు.

ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా స్వీకరించిన సంగతి తెలిసిందే. చదువుకోకపోయినా మనసులను కదిలించే అనేక కవితలు రచించడం, గొప్ప సాహిత్యవేత్తగా పేరొందడం, డాక్టరేట్ పొందడం మామూలు విషయం కాదు.   

అందెశ్రీ 2006లో నంది పురస్కారం, 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరధి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ పురస్కారం, 2022లో జానకమ్మ పురస్కారం, 2024లో దాశరధి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం అందుకున్నారు.  

అయన ప్రతిభను గుర్తించి కాకతీయ విశ్వవిద్యాలయం ‘గౌరవ డాక్టరేట్’తో సన్మానించింది. రాష్ట్ర గేయం అందించినందుకు సిఎం రేవంత్ రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించి ప్రభుత్వం తరపున ఆయనకు కోటి రూపాయలు నగదు పురస్కారం ఇచ్చి గౌరవించారు.       

తెలంగాణకు, ఉద్యమాలకు, సాహిత్యానికి అయన చేసిన సేవలకుగాను పోలీస్ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

మంగళవారం ఉదయం ఘట్ కేసర్ మండలంలోని ఎన్ఎఫ్‌సీ వద్ద గల హెచ్ఎండీఏకు చెందిన స్థలంలో అందెశ్రీ అంత్యక్రియలు జరుగుతాయి. ఆయనకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Related Post