తెరాసకు ప్రత్యామ్నాయం ఏది? కాంగ్రెస్‌...బిజెపి?

May 29, 2019


img

రాష్ట్రంలో ఇప్పుడు ఒక కొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్‌, బిజెపిలలో తెరాసకు ఏది ప్రత్యామ్నాయంగా నిలువబోతోందనే చర్చ అది. అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పొందిన బిజెపి, ఫిరాయింపులతో డ్డీలాపడిపోయిన కాంగ్రెస్ పార్టీ  లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ పుంజుకోవడంతో అవి ఈ కొత్తచర్చకు తెర తీశాయి. ఆ రెండు పార్టీలు తామే తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయమని వాదించడం మొదలుపెట్టాయి. కానీ లోక్‌సభ ఎన్నికలలో కాస్త ఎదురుదెబ్బ తిన్నంత మాత్రన్న తెరాస బలం తగ్గిందనుకోవడం, ప్రజలలో దాని పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందని కాంగ్రెస్‌, బిజెపిలు భ్రమిస్తే అవే నష్టపోతాయి తప్ప తెరాస కాదు. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌, బిజెపిలలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం దేనికి ఉంది? అని చూస్తే బిజెపికే ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకు కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 

జాతీయస్థాయి ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోవడం, రాహుల్ గాంధీ అస్త్రసన్యాసం చేయడం, ఫిరాయింపులు రాష్ట్ర కాంగ్రెస్‌కు శాపంగా మారాయి. లోక్‌సభ ఎన్నికలతో ఎదురుదెబ్బ తిన్న తెరాస, అనూహ్యంగా 4 సీట్లు గెలుచుకొన్న బిజెపి రెండూ కూడా ఇకపై కాంగ్రెస్ మీదనే దృష్టి పెడతాయి. 

ఇప్పటికే జైపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతలు తెరాసను ఎదుర్కొలేక అస్త్రసన్యాసం చేశారు. డికె అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటివారు బిజెపి తీర్ధం పుచ్చుకొన్నారు. మిగిలిన కాంగ్రెస్‌ నేతలను తమ పార్టీలలోకి ఫిరాయింపజేసుకోవడానికి తెరాస, బిజెపిలు గట్టి ప్రయత్నాలే చేయవచ్చు. అదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఖాళీ అయిపోవచ్చు. అప్పుడు తెరాసకు ప్రత్యామ్నాయంగా బిజెపి నిలుస్తుంది.  

బిజెపి నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకొన్నప్పటికీ రాష్ట్రంలో నేటికీ చాలా బలహీనంగానే ఉందని చెప్పక తప్పదు. కానీ కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఒకవేళ అది రాష్ట్ర బిజెపికి సహకరిస్తే తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగగలదు. కానీ బీజేపీ అటువంటి ప్రయత్నాలు మొదలుపెడితే తెరాస చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోదు కనుక దానితో యుద్ధానికి కూడా సిద్దపడవలసి ఉంటుంది. 


Related Post