అయితే తెలంగాణలో మోడీ ప్రభావం ఉన్నట్లేనా?

May 29, 2019


img

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందిస్తూ రాష్ట్రంలో బిజెపి అభ్యర్ధుల విజయానికి మోడీ ప్రభావం కూడా ఒక కారణమని అన్నారు. 

దానిపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ స్పందిస్తూ, “తెలంగాణపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభావం ఏమీ ఉండదని ఎన్నికల సమయంలో కేటీఆర్‌ గట్టిగా వాదించారు కానీ ఇప్పుడు మోడీ ప్రభావం వలననే బిజెపి అభ్యర్ధులు గెలిచారని మాట మార్చారు. పోస్టల్ బ్యాలెట్లలో కూడా బిజెపియే అగ్రస్థానంలో ఉందంటే అర్ధం ఏమిటి? దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం ఉందని స్పష్టం అవుతోంది కదా? రాష్ట్రంలో బిజెపి గెలుపును కాంగ్రెస్‌, తెరాసలు తక్కువ చేసి చూపుతున్నాయి. మా గెలుపును జీర్ణించుకోలేకనే వారు ఆవిధంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ తన కుమార్తె కవితను, తనకు కుడి భుజం వంటి వినోద్ కుమార్ ను గెలిపించుకోలేకపోయారు. ఆ అక్కసుతోనే కేటీఆర్‌ మా విజయం గురించి చులకనగా మాట్లాడుతున్నారు. కానీ ఎవరు అవునన్నా కాదనుకొన్నా తెలంగాణలో మోడీ, బిజెపి ప్రభంజనం మొదలైంది. ఉత్తర తెలంగాణలో మొదలైన ఈ ప్రభంజనం త్వరలో రాష్ట్రమంతటా వ్యాపిస్తుంది. మా తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమేనని మాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో మేము తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలువబోతున్నాము. దేశంలో 19 రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఉనికి లేదు. అదొక చుక్కానిలేని నావలా తయారైందిప్పుడు,” అని అన్నారు. 

రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగి నిలబడాలంటే కేంద్రం కూడా రాష్ట్ర బిజెపికి సహకరించవలసి ఉంటుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్‌-మోడీ స్నేహసంబందాల వలన తెరాస ఏమీ నష్టపోలేదు కానీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి భారీ మూల్యం చెల్లించింది. కనుక ఇకపై ప్రధాని మోడీ కేసీఆర్‌కు దూరంగా ఉంటూ రాష్ట్ర బిజెపి బలోపేతమయ్యేందుకు సహకరించవచ్చు.


Related Post