త్వరలో సిఎం కేసీఆర్‌ దేశాటన?

April 24, 2019


img

మే 19వ తేదీతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మే 23న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కనుక ఆలోగానే సిఎం కేసీఆర్‌ వివిద రాష్ట్రాలలో పర్యటించి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలనుకొంటున్నట్లు తాజా సమాచారం. ఇప్పటి వరకు కలవని నేతలతో పాటు ఇప్పటికే వివిద రాష్ట్రాలలో కలిసినవారిని కూడా మళ్ళీ మరోసారి కలిసి వారితో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు గురించి చర్చించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలలో పర్యటించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తునట్లు తెలుస్తోంది. అంటే మొట్టమొదటగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందని భావించవచ్చు. 

ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వామిగా చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నప్పటికీ, ఆయనను విజయవాడలో కలిసి మాట్లాడుతారని కొన్ని రోజుల క్రితం కేటీఆర్‌ చెప్పారు. కనుక ఏపీతోనే కేసీఆర్‌ దేశాటన మొదలవవచ్చు. 

లోక్‌సభ ఎన్నికలు ముగిసేసరికి ఫలితాలు ఏవిధంగా ఉండబోతాయో కేసీఆర్‌తో సహా వివిద రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కూడా సులువుగానే అంచనా వేయగలవు కనుక ఫలితాలు వెలువడేలోగా వారందరినీ కలిసినట్లయితే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యూపీలోని సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ, పశ్చిమబెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్, ఒడిశాలోని బిజేడి పార్టీలను ఒక్క త్రాటిపైకి తీసుకురాగలిగితే కేసీఆర్ సగం విజయం సాధించినట్లే. త్వరలోనే కేసీఆర్‌ పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉంది.


Related Post