హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్...దేనికి?

August 29, 2018


img

గత నాలుగేళ్ళుగా సిఎం కెసిఆర్‌తో సహా మంత్రులు, టిఆర్ఎస్‌ ఎంపీలు, రాష్ట్ర న్యాయశాఖ అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ హైకోర్టు విభజన చేసి తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. కానీ టిడిపి-బిజెపిల దోస్తీ, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సహాయనిరాకరణ కారణంగా ఇంతవరకు హైకోర్టు విభజన జరుగలేదు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. కానీ కేంద్రం హటాత్తుగా మేల్కొని దాని కోసం ఈ నెల 20న సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

విభజన చట్టం ప్రకారం ఒకే రాష్ట్రంలో...ఒకే ప్రాంతంలో రెండు హైకోర్టులు ఉండకూడదు కనుక హైదరాబాద్‌లో ఏపీ లేదా తెలంగాణా రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుకు 2015, మే 1న ఉమ్మడి హైకోర్టు అనుమతి నిరాకరించింది. దాదాపు నాలుగున్నరేళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోన్న కేంద్రప్రభుత్వం దానిని సవాలు చేస్తూ ఇప్పుడు పిటిషనువేసి దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరడం విశేషం. 

ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, ఏపీ సర్కార్ అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చురుకుగా చేస్తోంది. ఈ ఏడాది నవంబరులోగా హైకోర్టు విభజన ప్రక్రియ మొదలవుతుందని, వచ్చే ఏడాది మార్చినాటికల్లా ఏపీ, తెలంగాణా హైకోర్టులు వేర్వేరుగా పనిచేయడం ప్రారంభించే అవకాశం ఉందని రాష్ట్ర న్యాయశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెండు నెలల క్రితమే చెప్పారు. కనుక ఇప్పుడు కేంద్రం సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేసిందో దానికే తెలియాలి. కానీ ఈ పిటిషనుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టినప్పుడు అది హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టినట్లయితే, హైదరాబాద్‌లోనే ఏపీకి వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. 

హైకోర్టు విభజనకు సుప్రీంకోర్టులో పిటిషను వేసే బదులు అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ సర్కారుకు కేంద్రం సహకరిస్తే హైకోర్టు విభజన ప్రక్రియ సజావుగా పూర్తవుతుంది కదా? ఏపీ సర్కార్ ఇప్పుడు అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుచేసుకొంటున్నప్పుడు హైదరాబాద్‌లో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే అందుకు అంగీకరిస్తుందా? అంటే అనుమానమే. ఏపీ సర్కార్ తప్పకుండా కేంద్రం వేసిన పిటిషనును వ్యతిరేకిస్తూ వాదించడం ఖాయం. అంటే సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషను వేయడం వలన హైకోర్టు విభజన ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అర్ధమవుతోంది. అయినా హైకోర్టు విభజనకు ఏపీ సర్కార్ సహాయ నిరాకరణ చేస్తున్నప్పుడు నోరువిప్పని కేంద్రం, ఏపీ సర్కార్ ఇప్పుడు అమరావతిలో హైకోర్టు ఏర్పాటుచేసుకొంటున్నప్పుడు సుప్రీంకోర్టులో  ఎందుకు పిటిషను వేసిందో? తద్వారా అది ఏమి ఆశిస్తోందో?


Related Post