టిఆర్ఎస్‌కు 100 సీట్లు వస్తాయా?

August 20, 2018


img

రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ 100కు పైగా సీట్లు గెలుచుకొని అధికారంలోకి రావడం ఖాయంని సిఎం కెసిఆర్‌తో సహా మంత్రులు, టిఆర్ఎస్‌ నేతలు అందరూ గట్టిగా చెపుతున్నారు. అయితే నిష్పక్షపాతంగా ఆలోచిస్తే    ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులలో టిఆర్ఎస్‌ అన్ని సీట్లు సాధించలేకపోవచ్చునని చెప్పక తప్పదు. అందుకు బలమైన కారణాలు చాలా కనిపిస్తున్నాయి. 

1. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా కొంతకాలం పాలించిన తరువాత దానిపై ప్రజలలో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంటుంది. టిఆర్ఎస్‌ సర్కారు పట్ల కూడా ప్రజలలో కొంత వ్యతిరేకత నెలకొని ఉంది. కారణాలు అందరికీ తెలుసు.  

2. టిఆర్ఎస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవిధంగా తమ స్వంత బలంతో నెగ్గగలరో రాష్ట్ర కాంగ్రెస్‌లో కూడా అటువంటి బలమైన నేతలు చాలా మందే ఉన్నారని అందరికీ తెలిసిందే. ఈసారి ఎన్నికలు కాంగ్రెస్ నేతలందరికీ జీవన్మరణ సమస్య వంటివి కనుక వారు టిఆర్ఎస్‌కు చాలా గట్టి పోటీనీయడం ఖాయం.

3. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్-టిడిపితో పొత్తు పెట్టుకోబోతోంది. రాష్ట్రంలో టిడిపి చాలా బలహీనపడినప్పటికీ దానికి ఉన్న బలమైన క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలం అందించగలదు. 

4. సిఎం కెసిఆర్‌-ప్రధాని మోడీ మద్య ఉన్న అనుబందం మజ్లీస్ పార్టీకి గొంతులో వెలక్కాయలా మారిందని చెప్పవచ్చు. అందుకే మజ్లీస్ అధినేతలు ఈ ఒక్క అంశంపై నోరు విప్పలేకపోతున్నారని చెప్పవచ్చు. మోడీ-కెసిఆర్‌ అనుబందం ఎన్నికల తరువాత కూడా కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది. కనుక మోడీ మళ్ళీ ప్రధాని అయ్యేందుకు అవసరమైతే  టిఆర్ఎస్‌ మద్దతునీయవచ్చు. టిఆర్ఎస్‌తో దోస్తీ చేస్తున్న మజ్లీస్ అధినేతలకు ఈ విషయం తెలియదనుకోలేము. కనుక అందుకు వారు ఇష్టపడనట్లయితే, రాబోయే ఎన్నికలలోగా టిఆర్ఎస్‌కు దూరమయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పంచన చేరే అవకాశం ఉంది. ఆదేజరిగితే ముస్లింల ఓట్లన్నీ కాంగ్రెస్‌-మజ్లీస్ పార్టీలకే పడవచ్చు.

5. ‘రాష్ట్రంలో ఎన్ని కొత్త పార్టీలు, కూటములు పుట్టుకొచ్చినా టిఆర్ఎస్‌కేమీ భయం లేదు ఉండదు’ అని టిఆర్ఎస్‌ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, కోదండరామ్ నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణా జనసమితి, సిపిఎం నేతృత్వంలో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కూటమి, ఇంకా స్వతంత్ర, తిరుగుబాటు అభ్యర్ధులు టిఆర్ఎస్‌ ఓట్లను చీల్చడం ఖాయం. దాని వలన టిఆర్ఎస్‌కు ఎంతో కొంత నష్టం కలగడం కూడా ఖాయమేనని చెప్పవచ్చు.

6. ఇక కనీసం 30-40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సిఎం కెసిఆరే స్వయంగా హెచ్చరిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. అంతమంది పట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉండటం టిఆర్ఎస్‌కు ప్రమాదంగానే భావించవచ్చు. కనుక ఈసారి కూడా వారి పనితీరును బట్టి కాక కెసిఆర్‌ మొహం చూసే ఓట్లు వేసేలా టిఆర్ఎస్‌ వ్యూహం అమలుచేయక తప్పదు. 

7. టిఆర్ఎస్‌ సర్కారు ఎంతవేగంగా ఎన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ వాటిలో భారీగా అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ప్రజలలోకి బాగానే వెళుతున్నాయి. అలాగే ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ కారణంగా రైతులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నెలకొని ఉంది. 

8. ఉద్యోగాల భర్తీ హామీని టిఆర్ఎస్‌ సర్కారు అమలుచేయలేకపోయినందున యువతలో ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఆ అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తోంది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇస్తోంది. ఈ హామీ వలన కూడా టిఆర్ఎస్‌ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది.    

9. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ హామీని కూడా టిఆర్ఎస్‌ సర్కారు నిలబెట్టుకోలేకపోయింది. వాటికోసం గత మూడేళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న లక్షలాది పేదప్రజలు ఎన్నికలు దగ్గర పడుతున్నా అవి పూర్తి కాకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. వారి నిరాశ టిఆర్ఎస్‌ పట్ల వ్యతిరేకతగా మారే అవకాశం ఉంది. 

10. రాష్ట్రంలో దళితుల పట్ల పలు సందర్భాలలో ప్రభుత్వం, పోలీసులు, టిఆర్ఎస్‌ నేతలు వ్యవహరించిన తీరు కారణంగా వారు ఆగ్రహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, తెలంగాణా జనసమితి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కూటమి దీనినే ప్రధాన అస్త్రంగా వినియోగించుకోబోతున్నాయి.

కానీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కనుక ఆలోగా ఈ సమస్యలను అన్నిటినీ అధిగమించేందుకు టిఆర్ఎస్‌ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది కనుక ఈ పరిస్థితులు మారవచ్చు. ఏది ఏమైనపటికీ కనుక టిఆర్ఎస్‌ ‘ఆల్ ఈజ్ వెల్’ అని పాడుకోవడానికి లేదనే చెప్పవచ్చు.


Related Post