కాంగ్రెస్‌-టిఆర్ఎస్‌ నేతల కీచులాటలు దేనికి?

August 18, 2018


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌ పర్యటనకు ముందు నుంచి ప్రారంభం అయిన కాంగ్రెస్‌-టిఆర్ఎస్‌ నేతల మద్య కీచులాటలు నేటికీ కొనసాగుతూనే ఉండటం విశేషం. రాహుల్ గాంధీ తన పర్యటనలో టిఆర్ఎస్‌ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసి తిరిగి డిల్లీ వెళ్ళిపోయారు. ఆయన విమర్శలకు మంత్రి కేటీఆర్ అంతే ధీటుగా సమాధానం ఇస్తూ రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు సీనియర్ కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్ అంతకంటే తీవ్రంగా మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డిపై విమర్శలు చేశారు. కనుక ఇప్పుడు టిఆర్ఎస్‌ నేతలు మళ్ళీ  ప్రతివిమర్శలు చేయవచ్చు. రేపు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా వస్తే అప్పుడు బిజెపి-టిఆర్ఎస్‌ నేతల మద్య ఇదేవిధంగా మాటల యుద్దం జరుగడం ఖాయం. కానీ కాంగ్రెస్‌-టిఆర్ఎస్‌, బిజెపి-టిఆర్ఎస్‌ నేతలు ఎందుకు ఇంతగా కీచులాడుకొంటున్నారు? అనే సందేహం కలుగకమానదు.

అందుకు బలమైన కారణలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలని టిఆర్ఎస్‌ భావిస్తోంది. తన మనసులో ఈ మాటను టిఆర్ఎస్‌ బహిరంగంగానే చెపుతోంది. ఒక్క టిఆర్ఎస్‌కే కాదు...దేశంలో అన్ని పార్టీలకీ ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలని ఆశపడుతుంటాయి. కానీ మన ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టాలో ప్రజలే నిర్ణయిస్తుంటారు. కనుక ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టడానికి అధికార పార్టీకి ఎంత అవకాశం ఉందో ప్రతిపక్షలకు కూడా అంతే అవకాశం ఉంటుంది. ప్రతీ ఐదేళ్ళకు ఓసారి అన్ని పార్టీలు ఈ ఎన్నికల అగ్ని పరీక్షను ఎదుర్కోక తప్పదు.

టిఆర్ఎస్‌ సర్కారు చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కారణంగా వచ్చే ఎన్నికలలో తామే 100కు పైగా సీట్లు సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తామని టిఆర్ఎస్‌ బల్లగుద్ధి వాదిస్తోంది. కానీ ప్రభుత్వం పట్ల ప్రజలలో కొంత వ్యతిరేకత కూడా ఉందని టిఆర్ఎస్‌ నేతలకు తెలుసు. తమకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ వ్యతిరేకతను మరింత రాజేసి ఎక్కడ తమ పార్టీకి నష్టం కలిగితుందోనని టిఆర్ఎస్‌ ఆందోళన చెందడం సహజమే. ఆ భయం లేదా అభద్రతాభావంతోనే టిఆర్ఎస్‌ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారని చెప్పవచ్చు. 

ఇక వచ్చే ఎన్నికలు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలందరికీ జీవన్మరణ సమస్యవంటివి. ఆ ఎన్నికలలో ఓడిపోతే వారు ఇంకా రాజకీయాలలో కొనసాగడానికి బలమైన కారణాలు ఏమీ ఉండవు కనుక వారిలో చాలా మంది రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పుకోవలసి రావచ్చు. మళ్ళీ 2024లో ఎన్నికల నాటికి ఇప్పుడున్న నేతలలో చాలా మంది ఉండకపోవచ్చు. కనుక అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందో లేదో తెలియదు. కనుక ఇటువంటి కీలకమైన సమయంలో టిఆర్ఎస్‌ నేతల తమపై చేస్తున్న అవినీతి ఆరోపణలకు ధీటుగా జవాబీయకపోతే ప్రజలకు తమ పట్ల దురభిప్రాయం ఏర్పడితే ఎన్నికలలో తీవ్రంగా నష్టపోతామనే భయంతోనే కాంగ్రెస్‌ నేతలు కూడా ధీటుగా సమాధానాలు ఇస్తున్నారని చెప్పవచ్చు. రాష్ట్రంలో బిజెపికి కూడా ఇవే కారణాలతో టిఆర్ఎస్‌తో మాటల యుద్దం చేస్తుంటుంది. 


Related Post