బిగ్‌బాస్‌-10లో ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్

November 01, 2026


img

నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్‌-10 మంచి రసవత్తరంగా సాగుతోంది. అప్పుడే ఈ షో 8వ వారంలోకి వచ్చేసింది. ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావాల్సి ఉండగా శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రముఖ ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్ అయ్యారు. 

ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఆమెను బయటకు పంపిస్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. నేడు (ఆదివారం) మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరగనుంది.

శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్ల ఆటతీరును బట్టి వారికి స్టార్స్ ఇచ్చారు. ఆ లెక్కన సుధీర్, ఝాన్సీ, ఆర్కే, నీతూలు ఆశించిన స్థాయిలో ఆడలేదంటూ వారికి స్టార్స్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. అయితే నరేశ్, రామ్ ప్రసాద్ ఆటతీరు అద్భుతంగా ఉందంటూ వారికి ఐదు స్టార్స్ ఇచ్చారు.

ఈ షోలో ఉత్సాహంగా పాల్గొంటున్న వర్షిణికి మొదట మూడు స్టార్స్ ఇచ్చిన నాగార్జున, శివకుమార్ గురించి ఆమెతో పాటు ముకేశ్, సుధీర్, రోహిత్ రహస్యంగా మాట్లాడుకున్న వీడియోను ప్లే చేసి చూపారు. ఆ సంభాషణలోని వర్షిణి చేసిన  కొన్ని వ్యాఖ్యలపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమెకిచ్చిన మూడు స్టార్స్‌ వెనక్కు తీసేసుకున్నట్లు ప్రకటించారు. 

ఇదే ఎపిసోడ్‌లో త్రిగుణ్ గురించి వర్షిణి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా నాగార్జున చూపించారు. త్రిగుణ్ బలహీనతపై దెబ్బ కొడతానని ఆమె చెప్పిన మాటలపై త్రిగుణ్ స్పందిస్తూ.. సరైన సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని తెలిపారు. నాగార్జున అతడి ఆటతీరును అభినందించి ప్రత్యేక బహుమతి అందించారు.

చివర్లో జరిగిన ఎలిమినేషన్‌లో త్రిగుణ్ కుండలను పగలగొట్టగా, అందులో ఝాన్సీ ఫొటో కనిపించలేదు. దీంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 

అయితే అంతకుముందు ముకేశ్ తన మ్యాజిక్ పవర్ ఉపయోగించి సుధీర్‌ను సేవ్ చేశాడు. ఆ అవకాశం లేకపోతే సుధీర్ ఎలిమినేట్ అయ్యేవాడని నాగార్జున నవ్వుతూ చెప్పారు. 

తన నిర్ణయం కారణంగానే ఝాన్సీ హౌస్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందనే బాధతో ముకేశ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఝాన్సీ కూడా తీవ్ర భావోద్వేగానికి గురైంది. అయితే ఈ షో కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేనని, అదే తన ఎలిమినేషన్‌కు కారణమైందని చెబుతూ హౌస్‌మేట్స్‌కు వీడ్కోలు పలికింది.


Related Post

సినిమా స‌మీక్ష