విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చింది. విజయ్ దేవరకొండ, రష్మికలనటన, కథపై ప్రశంసలు వస్తున్నప్పటికీ, సినిమా నిడివి (మూడు గంటలు), కథనంలో వేగం లేకపోవడంతో మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా రివ్యూలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఇవన్నీ రణబాలి కలెక్షన్స్పై కొంత ప్రభావం చూపినట్లే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సాక్నిల్క్ వెబ్సైట్ అంచనాల ప్రకారం, ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు సుమారు రూ.16.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. భారత్లో రూ.9.25 కోట్ల నెట్, రూ.10.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్లో రూ.5.75 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా సుమారు 2,515 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు సగటున 57 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోలతో పోలిస్తే రాత్రి షోలకు ప్రేక్షకుల హాజరు పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
మొత్తంగా తొలి రోజు వసూళ్లతో ‘రణబాలి’ బాక్సాఫీస్ ప్రయాణం కాస్త నిరాశాజనకంగా ఉన్నప్పటికీ వారాంతపు సెలవులు, పండుగ సెలవులలో పుంజుకునే అవకాశం ఉంది. రణబాలితో పోలిస్తే రజినీకాంత్ నటించిన జైలర్-2 దూసుకుపోతోంది.
తొలిరోజున భారత్లో జైలర్ రూ.70.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టగా, వాటిలో నికర వసూళ్లు రూ.59.70 కోట్లుగా నమోదయ్యాయి.
విదేశాల్లో మరో రూ.55 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.125.25 కోట్లకు చేరినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఊహించినట్లే తమిళ వెర్షన్ అత్యధికంగా రూ.43.35 కోట్ల నికర వసూళ్లు సాధించగా, జైలర్ తెలుగు వెర్షన్ రూ.12.50 కోట్లు, హిందీ వెర్షన్ రూ.3.50 కోట్లు, కన్నడ వెర్షన్ కేవలం రూ.35 లక్షల వసూళ్లు సాధించింది.