తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మద్య టికెట్స్ ఆదాయం వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేడు ఫిలిం ఛాంబర్‌లో ప్రెస్‌మీట్ పెట్టి, “ఆంధ్రాలో పెద్ది సినిమాకి టికెట్స్ ధరలు పెంచుకుంటే పెంచుకోవచ్చు. కానీ తెలంగాణలో పర్సంటేజ్ విధానం అమలుచేస్తేనే పెద్ది ప్రదర్శిస్తాము. లేకుంటే సింగిల్ స్కీన్ థియేటర్లలో ప్రదర్శించము.
రెండు నెలల తర్వాత కూర్చొని మాట్లాడుకుందామన్నారు. కానీ నిర్మాతల తీరు చూస్తే వారు ఏదో విధంగా పెద్దిని విడుదల చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మరో పెద్ద సినిమా వచ్చే వరకు ఈ వ్యవహారం నాన్చుతారని భావిస్తున్నాం. కనుక రెండు నెలల తర్వాత మాట్లాడేదేదో ఇప్పుడే మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
మాకు పెద్ది లేదా మరో సినిమాతో ఎటువంటి సమస్యా లేదు. మాకు గిట్టుబాటు కాకుండా సినిమాలు ప్రదర్శించమని ఒత్తిడి చేస్తుండటమే అసలు సమస్య. కనుక ముందు మా సమస్యని పరిష్కరించుకోవాలని మేము అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము,” అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ శ్రీధర్ అన్నారు.
“తెలంగాణలో పెద్ది టికెట్ ఛార్జీలు పెంచవద్దని మేము సిఎం రేవంత్ రెడ్డికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశాము. ఒకవేళ ప్రభుత్వం పెంచితే తగిన నిర్ణయం తీసుకుంటాము. సినీ పరిశ్రమకి పెద్ద దిక్కు వంటి చిరంజీవిగారిని కూడా కలిసి మా సమస్యని వివరించి సహకరించాల్సిందిగా కోరుతాము,” అని శ్రీధర్ చెప్పారు.