ఎన్నికలకు బిజెపి రెడీ..మరి తెరాస?

August 17, 2019


img

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో తెరాస కనీసం 100 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో సిఎం కేసీఆర్‌ సుమారు 12 నెలలపాటు అనేక వ్యూహాలు, కార్యక్రమాలు అమలుచేసి 99 సీట్లు గెలుచుకునేలా చేశారు. ఈసారి బిజెపి ఆ పని చేస్తోంది. త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలకు, 2021లో జరుగబోయే జీహెచ్‌ఎంసీకి ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. దానిలో భాగంగా రాష్ట్రంలో వివిద జిల్లాలో, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో గల కాంగ్రెస్‌, టిడిపి నేతలను, కార్యకర్తలను బిజెపిలోకి రప్పించేందుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, రాష్ట్ర ముఖ్యనేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలలోగానే బలం కూడదీసుకొని తెరాస, కాంగ్రెస్‌, మజ్లీస్ పార్టీలను డ్డీకొని తమ సత్తా చాటుకోవాలని బిజెపి నేతలు తహతహలాడుతున్నారు. 

ఈ నెల 18న నాంపల్లిలో జరుగబోయే బిజెపి బహిరంగసభలో గ్రేటర్ హైదరాబాద్‌త్‌ సహా వివిద జిల్లాలకు చెందిన 10-15 మంది ప్రముఖ నేతలను, కనీసం 20,000 మంది కార్యకర్తలను బిజెపిలో చేర్చుకునేందుకు బిజెపి నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 

ఒకప్పుడు బిజెపిని అంటరాని పార్టీగా చూసిన నేతలు సైతం ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడినందున, తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బిజెపిలో చేరేందుకు సిద్దపడుతున్నారు కనుక వారందరి చేరికతో గ్రేటర్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బిజెపి బలపడుతుందని స్పష్టం అవుతోంది. మున్సిపల్ ఎన్నికలు ఆలస్యం కావడం కూడా బిజెపికి కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. ఆలోగా పార్టీలో బారీగా చేరికలు ఉంటాయి కనుక మున్సిపల్ ఎన్నికలలోనే తెరాసకు గట్టి పోటీ ఇస్తుందేమో?మున్సిపల్, గ్రేటర్ ఎన్నికలకు ఈసారి బిజెపి ముందే సిద్దం అవుతోంది మరి తెరాస సిద్దంగా ఉందా?


Related Post