ప్రపంచంలో అత్యాధునికమైన, అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ అది. అది గాల్లో ఎగరడానికి, నేలపై దిగడానికి రన్ వే కూడా అవసరం లేదు. వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ కాగలదు. అటువంటి అత్యాధునిక యుద్ధ విమానం 20 రోజులుగా కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో ఉండిపోయింది. నేటికీ అది గాల్లోకి ఎగిరే పరిస్థితి లేకపోవడంతో దాని రెక్కలు విడదీసి కార్గో విమానంలో తీసుకువెళ్ళబోతున్నారు.
అదే బ్రిటన్ నేవీకి చెందిన ఎఫ్-35బి యుద్ద విమానం. భారత్-బ్రిటన్ సంయుక్త నేవీ విన్యాసలలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు అరేబియా సముద్రంలో లంగరు వేసిన బ్రిటన్‌కు చెందిన విమాన వాహక యుద్ధనౌకపై నుంచి అది జూన్ 14న రాత్రి బయలుదేరింది.
దారిలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో తిరువంతపురం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. అదే రోజు రాత్రి నిపుణులు వచ్చి దానికి మరమత్తులు చేశారు. కానీ సమస్య అలాగే ఉండటంతో బ్రిటన్ నుంచి నిపుణుల బృందం వచ్చి మరమత్తులు చేసింది. అయినా అది గాల్లోకి లేవలేకపోయింది.
కనుక ఇంకా ఇక్కడే ఉంచి మరమత్తులు చేయడం కంటే స్వదేశానికి తరలించడం మంచిందని నిపుణుల బృందం నిర్ణయించింది. కనుక ఎఫ్-35బి యుద్ద విమానాన్ని తరలించడం కోసం లండన్ నుంచి సీ-17 గ్లోబ్ మాస్టర్ అనే అతి భారీ కార్గో విమానాన్ని రప్పిస్తున్నారు.
కానీ దానిలో విమానాన్ని యధాతధంగా తరలించడం సాధ్య పడదు కనుక రెక్కలు, మరికొన్ని పెద్ద భాగాలు వేరు చేసి కార్గో విమానంలో లండన్ పంపించబోతున్నారు.