అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేసిన ‘ఫంకీ’ శుక్రవారం విడుదలైంది. జాతి రత్నాలతో ప్రేక్షకులను అలరించిన అనుదీప్ దర్శకత్వంలో ఈ సినిమా తీసినందున భారీ అంచనాలే ఉన్నాయి.
ఫంకీలో కూడా కామెడీ బాగానే పండింది కానీ ‘జాతి రత్నాలు’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కనుక అందుకు తగ్గట్లే రివ్యూలు, విమర్శలు వచ్చాయి. వాటిపై నిర్మాత స్పందిస్తూ, “సోషల్ మీడియాలో ‘ఫంకీ’లో కధ లేదు. సన్నివేశాలు అతుకులు పెట్టి తీశారు. ఫ్లో లేదు... అంటూ ఏవేవో వ్రాశారు.
ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేందుకు కామెడీ సినిమా తీశామని మొదటి నుంచే చెపుతున్నాను కదా? కానీ మీరేదో కొత్తగా కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారేంటి? అయినా నేనేమీ సాగర సంగమం తీశానని చెప్పడం లేదు కదా? సినిమాలో కామెడీని ఎంజాయ్ చేయకుండా కోడిగుడ్డుకి ఈకలు పీకడం దేనికి?” అని అన్నారు.
నిర్మాత నాగవంశీ మొదటి నుంచి కూడా సినిమాకి కధ, కధనం ఏవీ ముఖ్యం కావు. నలుగురు నటులతో కామెడీ చేయించి ప్రేక్షకులను నవ్విస్తే చాలు సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఫంకీతో కూడా అదే చేశారు.
కనుక తన సినిమాల విషయంలో ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది. ఆయన తీసే సినిమాలు ఇలాగే ఉంటాయని ప్రేక్షకులకు అర్దమైంది. కనుక నచ్చితే చూస్తారు. లేకుంటే లేదు. మద్యలో రివ్యూలతో హడావుడి దేనికి?అవసరమా?
ఫంకీలో విశ్వక్ సేన్‌కు జోడీగా కాయడు లోహర్ నటించగా నరేష్, విటివి గణేశ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనుదీప్, సంగీతం: భీమ్స్ సీసీరిలియో, కెమెరా: సురేష్ సంగం, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ నిర్మించారు.