సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 9న విడుదలైన ‘ది రాజాసాబ్’కు మిశ్రమ స్పందన వస్తుండటంతో దర్శకుడు మారుతి తీవ్ర ఒత్తిడికి గురవడం సహజమే. అయితే రాజసాబ్ కధ కాస్త గందరగోళంగా అనిపించడం వలన చాలా మంది సినిమాని అర్థం చేసుకోలేకపోయారని మారుతి అన్నారు.
పది రోజులలో రాజసాబ్ నిలద్రొక్కుకొని దూసుకుపోతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమా జరుగుతున్న దుష్ప్రచారానికి, తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు రాజాసాబ్ సక్సస్‌తోనే జవాబు లభిస్తుందన్నారు. తాను మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానినని ఎప్పటికైనా ఆయనతో సినిమా చేయాలనేది తన కోరికన్నారు. భవిష్యత్‌లో తప్పకుండా చిరంజీవితో సినిమా చేస్తానని నమ్మకం ఉందన్నారు.
జనవరి 9న విడుదలైన రాజసాబ్ మొదటి నాలుగు రోజులలో రూ.201 కోట్లు పైన కలెక్షన్స్ సాధించినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మంగళవారం ప్రకటించింది.
రాజసాబ్ సినిమా చేస్తున్నప్పుడే ప్రభాస్ సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ రెండు సినిమాలు లైన్లో పెట్టేశారు. కల్కి-2 టీమ్ ఆయన కోసం ఎదురు చూస్తోంది. కనుక రాజసాబ్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ ముందుకు సాగిపోక తప్పదు. మరి మారుతి తర్వాత సినిమా ఏమిటో? ఎవరితో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.