ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకు వస్తున్న మన శంకర వరప్రసాద్ గారి హడావుడి చాలా ఎక్కువగా ఉంది. వెంకటేష్, చిరంజీవి ఇద్దరు సీనియర్ హీరోలు కలిసి మెగా విక్టరీ అంటూ డాన్స్ చేసిన తర్వాత అభిమానులలో జోష్ ఇంకా పెరిగిపోయింది. కనుక ఇప్పుడు ఎక్కడ చూసినా మన శంకర వరప్రసాద్ గారి గురించే మాట్లాడుకుంటున్నారు. రేపు ట్రైలర్ కూడా వచ్చేస్తే ఇక చెప్పక్కరలేదు.
కానీ ఈ హడావుడిలో చిరంజీవి ఎప్పుడో పూర్తిచేసిన ‘విశ్వంభర’ పత్తా లేకుండా పోయింది. చిరంజీవి, శ్రీదేవి జంటగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ వంటి సూపర్ డూపర్ సోషియో ఫ్యాంటసీ సినిమా తర్వాత విశ్వంభర చేయడంతో దానిపై చాలా భారీ అంచనాలు ఉండేవి.
కానీ ఓసారి రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం, మరోసారి గ్రాఫిక్స్ వర్క్స్ కోసం, మరోసారి మరో కారణంతో వాయిదాలు వేసుకుంటూ పోవడం వలన విశ్వంభర గురించి అందరూ మరిచిపోయారు.
ఆ సినిమా రిలీజ్ చేయకుండా మద్యలో అనిల్ రావిపూడితో మన శంకర వరప్రసాద్ గారు మొదలుపెట్టి పూర్తి చేసి జనవరి 12కి వచ్చేస్తున్నారు.
కనుక ఈ హడావుడి పూర్తయితే మళ్ళీ విశ్వంభరని గాడిలో పెట్టుకొని వేసవిలో విడుదలకు సిద్దం చేసుకోవాలి. అది మళ్ళీ ఏబీసీడీలతో మొదలుపెట్టినట్లే అవుతుంది. కానీ తప్పదు మరి!