పాలమూరు-రంగారెడ్డి : కేంద్రానికి ఓ విజ్ఞప్తి!

January 04, 2026


img


పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఈరోజు కొత్తగా మొదలుపెట్టలేదు. సమైక్య రాష్ట్రంలోనే మొదలుపెట్టారు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు తలుచుకుంటే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయవచ్చు. కానీ ఆయన కమీషన్లు దండుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 

మళ్ళీ ఆయనే మొన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదని మొసలి కన్నీళ్ళు కార్చుతూ ఆ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై శాసనసభలో చర్చిద్దాం రమ్మంటే రాకుండా కేసీఆర్‌తో సహా అందరూ పారిపోయారని సిఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

కానీ ఓ తెలంగాణ బిడ్డగా తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దాని కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఎవరితోనైనా పోరాడుతానని సిఎం రేవంత్ రెడ్డి నిన్న శాసనసభలో చెప్పారు. 

సాగు, తాగు నీటి అవసరాల కోసం90 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డికి నిన్న శాసనసభలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. 

రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వీలైనంత త్వరగా అన్ని అనుమతులు మంజూరు చేయాలని తీర్మానంలో కేంద్రాన్ని కోరారు. 

అలాగే ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న పోలవరం-బనకచర్ల, పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టులతో సహా గోదావరిపై నిర్మించే ఏ ప్రాజెక్టుని అనుమతించరాదని కేంద్రానికి తెలంగాణ శాసనసభ విజ్ఞప్తి చేసింది. 



Related Post