ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తుల కోసం 96 గదులతో భవన సముదాయ నిర్మాణానికి, దీక్ష విరమణలకు మండప నిర్మాణానికి భూమిపూజ చేస్తారు.
అనంతరం నాచుపల్లి శివారులో గల ఓ రిసార్టులో జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం హైదరాబాద్ బయలుదేరి వెళతారు. సాయంత్రం మళ్ళీ ఏపీకి తిరుగు ప్రయాణం అవుతారు.
గతంలో పవన్ కళ్యాణ్ కొండగట్టుకి వచ్చినప్పుడు ఆలయ నిర్వాహకులు కాటేజీ, మండపం నిర్మాణాలకు తోడ్పడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందిస్తూ టిటిడీ పాలక మండలితో మాట్లాడి వీటి నిర్మాణాల కోసం రూ.35.19 కోట్లు నిధులు కేటాయింప జేశారు. టిటిడీ అందిస్తున్న ఆ నిధులతోనే ఈ నిర్మాణాలు జరుగబోతున్నాయి. కనుక ఆలయ నిర్వాహకులు పవన్ కళ్యాణ్‌ని ఆహ్వానించి ఆయన చేతే ఈ భూమిపూజ చేయిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఇదివరకు సినీ నటుడుగా, జనసేన అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కానీ ఇప్పుడు ఏపీ డెప్యూటీ సిఎం హోదాలో వచ్చారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం అయన పర్యటనలో భారీగా పోలీసులను మొహరించి తగిన భద్రత ఏర్పాట్లు చేసింది.