పోలిశెట్టికి పెళ్ళి కాలేదు కానీ.. పెళ్ళి రెసిప్షన్‌!

December 31, 2025


img

మన జాతిరత్నాలలో ఒకడైన నవీన్ పోలిశెట్టి ఇంకా పెళ్ళి చేసుకోలేదు. కానీ ముందే పెళ్ళి రెసిప్షన్‌ పార్టీ పెట్టేశాడు!

నవీన్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ జనవరి 14న సంక్రాంతి పండుగకి విడుదల కాబోతోంది. కనుక ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘అనగనగా ఒక రాజు పెళ్ళి రెసిప్షన్‌’ ఏర్పాటు చేశారు.

దానిలో ఇద్దరూ పాల్గొని ఆడిపాడారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఇది పెళ్ళి రెసిప్షన్‌ అన్నారు కనుక విలేఖరులు కూడా పెళ్ళి గురించే ప్రశ్నలు అడిగారు. 

పెళ్ళెప్పుడు? అంటే ప్రభాస్‌ పెళ్ళి చేసుకున్న మర్నాడు మధ్యాహ్నమే అని చెప్పారు. నిజ జీవితంలో పెళ్ళి చేసుకోలేకపోయినా ప్రతీ సినిమాలో తప్పనిసరిగా ఓ పెళ్ళి చేసుకుంటున్నాను కదా? అందాక ఇలా కాలక్షేపం చేసేస్తాను,” అని అన్నారు. 

పెళ్ళి కూతురులో ఎలాంటి లక్షణాలు ఉండాలి? అని అడిగితే “ఇలా... మీలా ప్రశ్నలు అడగకుండా ఉంటే చాలు. తను ఎలా ఉన్నా తన కోసం నేను మారడానికి రెడీ,” అన్నారు. 

“సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు కదా? పర్వాలేదా?” అని ఓ విలేఖరి అడిగితే, “సామాన్య కుటుంబం నుంచి పెద్ద హీరోగా ఎదగవచ్చని నిరూపించినవారు చిరంజీవి. నాతో సహా ఆయన ఎంతో మందికి స్పూర్తినిచ్చారు. ఆయన స్పూర్తితో సినీ పరిశ్రమలో నిలబడినవారిలో నేను కూడా ఒకడిని. ఆయన వీరాభిమానిని.

కనుక ఆయన సినిమా చూసిన తర్వాత అందరూ నా సినిమాకి వస్తారనే అనుకుంటున్నా. ఈ ధైర్యంతోనే సంక్రాంతికి మేము వస్తున్నాము,” అని నవీన్ పోలిశెట్టి జవాబిచ్చారు. 


Related Post

సినిమా స‌మీక్ష