సాయంత్రం ఇంకా 5 కాలేదు. కానీ హైదరాబాద్‌లో చలి విపరీతంగా ఉంది. అయినా నగరంలో వివిధ ప్రాంతాలలో జరుగబోతున్న నూతన సంవత్సర వేడుకలకు జనం అప్పుడే బయలుదేరిపోతున్నారు. ఈరోజు అర్ధరాత్రి దాటేవరకు నగరంలో హడావుడి అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది తప్ప ఏమాత్రం తగ్గదు.
కనుక ఆటోలు, క్యాబులు, టాక్సీలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ 6-7 గంటల్లో ఎంతైనా సంపాదించుకోవచ్చు. కనుక డ్రైవర్లు తమకు తక్కువ సమయంలో ఎక్కువ లాభం వచ్చే మార్గాలలోనే సేవలందించడానికి మొగ్గు చూపుతుంటారు.
సాధారణ రోజుల్లోనే దూర ప్రాంతాలకు, రిటర్న్ బుకింగ్స్ లభించని ప్రాంతాలకు వెళ్ళేందుకు ఇష్టపడరు. ఈరోజు అసలు అంగీకరించరు.
కానీ ఒకసారి రైడ్ బుకింగ్ ఖరారు అయిన తర్వాత డ్రైవర్లు తప్పనిసరిగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలు చేర్చాల్సిందే లేకుంటే మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని నగర కమీషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
ఈ నిబంధన ఈ ఒక్కరోజుకే వర్తిస్తుందని చెప్పారు. ఒకవేళ డ్రైవర్లు ఎవరైనా నిరాకరించినా, బుకింగ్ ధర కంటే అధికంగా డిమాండ్ చేసినా 94906 16155 నంబరుకు వాట్సప్ లేదా సోషల్ మీడియాలో తనకు మెసేజ్ చేయాలని వీసీ సజ్జనార్ నగర ప్రజలకు సూచించారు.