హైదరాబాద్‌లో మందు బాబులకు బంపర్ ఆఫర్!

December 31, 2025
img

హైదరాబాద్‌లో మద్యం త్రాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరం అంతటా భారీగా పోలీసులు మొహరించి పగలు రాత్రి అని తేడా లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వారి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు.

వందలు వేలు ఖర్చుచేసి మందు కొడితే పోలీసుల వలన మత్తు పూర్తిగా దిగిపోతోందని మందుబాబులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

వారి బాధని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫారం వర్కర్స్ యూనియన్ మాత్రమే అర్థం చేసుకోగలిగింది. అందువల్లే ర్యాపిడో, ఊబర్, స్విగ్గీ, జోమోటో తదితర గిగా వర్కర్స్ ఈరోజు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మందుబాబులకు ఉచితంగా రవాణా సేవలు అందిస్తారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫారం వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. 

మందుబాబుల కోసం బైకులు, క్యాబులు, ఆటోలు వగైరా కలిపి మొత్తం 500 వాహనాలు సిద్ధం చేశామని తెలిపింది. హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ పరిధిలో మాత్రమే తమ ఉచిత సేవలు లభిస్తాయని తెలిపింది. కనుక మందుబాబులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేందుకు 897 700 9804 నంబరుకి కాల్ చేయవచ్చని తెలిపింది.

Related Post