ఈరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. అలాగే పబ్బులు, మద్యం దుకాణాలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. కనుక మద్యం తాగి వాహనాలు నడిపేవారు కూడా ఎక్కువే ఉంటారు. వారి కోసం ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు నిర్వహిస్తున్నారు.
మద్యంతాగి వాహనాలు నడిపేవారు బైక్ రేసులు, కార్ రేసులు చేయకుండా నివారించేందుకు గాను నగరంలో నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ పైకి వెళ్ళే మార్గాలను మూసివేస్తారు. వాటిపైకి వాహనాలను అనుమతించరు.
అలాగే పీవీ ఎక్స్‌ప్రెస్ వే పైకి సరుకు రవాణా వాహనాలను, విమానాశ్రయానికి వెళ్ళేవారిని, వచ్చేవారిని మాత్రమే అనుమతిస్తారు. కానీ తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసులకు విమానం టికెట్ చూపించాల్సి ఉంటుంది. నగరంలో బేగంపేట్, టోలీచౌకి మినహా అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తారు. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి రేపు తెల్లవారుజాము 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.