ప్రముఖ హాస్య నటులు ప్రవీణ్, వైవా హర్ష, షైనింగ్ ఫణి, కృష్ణ భగవాన్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్న ‘భకాసుర రెస్టారెంట్’ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదలైంది.
మహాభారతంలో భకాసరుడు అనే రాక్షసుడి ఆకలి తీర్చడానికి ప్రతీరోజూ ఓ ఊరిలో నుంచి ఒక వ్యక్తి ఎద్దుల బండి నిండా ఆహార పదార్ధాలు పెట్టుకొని, అతను ఉండే కొండ గుహలోకి వెళితే, ఆ రాక్షసుడు ఆ ఆహారాన్ని, దానిని తీసుకువచ్చిన ఆ మనిషిని, ఎద్దులను కూడా చంపి తినేవాడు. అప్పుడు మహా బలశాలి అయిన భీముడు ఆ ఆహారం తీసుకువెళ్ళి అంతా తనే తినేసి, ఆ రాక్షసుడిని చంపి ప్రజలకు విముక్తి కల్పిస్తాడు.
ఇటువంటి చక్కటి కధని బేస్ చేసుకొని ‘భకాసుర రెస్టారెంట్’ తీస్తున్నారు. కానీ ఇలాంటి ఆకట్టుకునే టైటిల్ ఒక్కటే సరిపోదు. దీనిని హర్రర్ కామెడీ సినిమాగా తీస్తున్నట్లు ఫస్ట్-లుక్ పోస్టర్‌తో చెప్పేశారు. కనుక కధ, కధనం, కాన్సెప్ట్ మూడూ బలంగా ఉంటే పరవాలేదు. లేకుండా కేవలం కామెడీ చేసి హిట్ కొట్టాలనుకుంటే చాలా కష్టమే.
భకాసుర రెస్టారెంట్‌తో ఎస్ జె శివ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఎస్ జె మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి కలిసి ఈ సినిమా నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.