మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ నుంచి శివ శివ శంకరా అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదలయ్యింది. సరస్వతీ పుత్ర అని బిరుదు తగిలించుకొని అడ్డమైన పాటలు వ్రాస్తూ నవ్వులపాలు అవుతున్న రామజోగయ్య శాస్త్రి మళ్ళీ చాలా కాలం తర్వాత అద్భుతమైన ఈ పాట అందించారు.
కన్నప్ప శివ భక్తుడుగా మారిన తర్వాత పొందే ఆనందం, అనుభూతిని ఈ పాటలో చక్కగా అభివర్ణించారు. ఈ పాటని స్టీఫెన్ దేవస్య అద్భుతంగా స్వరపరచగా విజయ్ దేవరకొండ ప్రకాష్ అద్భుతంగా పాడారు.
ఈ పాటలో మంచు విష్ణు నటన కూడా చాలా బాగుంది. లొకేషన్, షెల్డన్ కెమెరా పనితనం ఈ పాటలో చాలా స్పష్టంగా కనిపించింది. ఈ పాట స్థాయిలోనే సినిమా కూడా ఉంటే కన్నప్ప తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.
హిందీ ‘మహా భారత్’ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప తీస్తున్నారు. ఈ సినిమాలో నుపూర్ సనన్ మంచు విష్ణుకి జోడీగా నటిస్తోంది. ఆమెను కూడా ఈ పాటలో చూపారు. కన్నప్పలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా నటిస్తున్నారు. ప్రభాస్ రుద్రుడుగా నటిస్తున్నారు. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు విష్ణు సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.