రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో శుక్రవారం విడుదలైన గేమ్ చేంజర్ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. కమల్ హాసన్ వంటి పెద్ద నటుడుతో భారతీయుడు-2 సినిమా తీసి అందరినీ నిరాశపరిచిన దర్శకుడు శంకర్, టాలీవుడ్ అగ్రనటులలో ఒకరైన రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్ ఏవిదంగా తీస్తాడో?అని అభిమానులు మొదట నుంచి ఆందోళన చెందుతూనే ఉన్నారు.
వారు భయపడిన్నట్లే ఓ పాత కధకి మసాలా దట్టించి ప్రేక్షకుల మీదకి వదిలాడని సినీ విశ్లేషకులు, మీడియా విమర్శలు గుప్పిస్తుంటే అభిమానులు వారిపై, దర్శకుడు శంకర్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో టికెట్ ఛార్జీలు పెంపుకి అనుమతించకపోవడం, ప్రివిలేజ్ షోలు నిరాకరించడం, బెనిఫిట్ షోల కుదింపు వంటివన్నీ కలెక్షన్స్‌పై తప్పక ప్రభావం చూపుతాయి.
బాలకృష్ణ నటించిన ‘డాకూ మహరాజ్’ రేపు విడుదల కాబోతోంది. వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకొని జనవరి 14న విడుదల కాబోతోంది.
తెలంగాణలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి ఏపీలో ఈ రెండు సినిమాల నుంచి గేమ్ చేంజర్‌కు గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. కనుక ఇవి కూడా మిశ్రమ స్పందన తెచ్చుకున్న గేమ్ చేంజర్ కలెక్షన్స్‌పై తప్పక ప్రభావం చూపుతాయి.
ఈ నేపధ్యంలో గేమ్ చేంజర్‌ని గత్తెక్కించడానికి మొదటి రోజు కలెక్షన్స్‌ని భారీగా పెంచి చూపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించిన్నట్లు చూపుతూ పోస్టర్ రిలీజ్ చేయగా, దానిలో సగం మాత్రమే కలెక్షన్స్ వసూలయ్యాయని సినీ మీడియా సంస్థలు కలెక్షన్స్ రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.
అయితే సంక్రాంతి బరిలో ‘గేమ్ చేంజర్’ అవుతుందనే నమ్మకంతో వందల కోట్ల భారీ భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా నష్టపోతే ఎవరికీ మంచిది కాదు. కనుక ఆ సినీ నిర్మాణ సంస్థ ప్రయత్నాలను తప్పు పట్టడం అనవసరం. ఒకవేళ సినిమా నచ్చకపోతే ప్రేక్షకులే దాని భవిష్యత్ నిర్ణయిస్తారు కదా?