డిస్నీ హాట్ స్టార్‌లో లైగర్‌... చూశారా?

September 22, 2022


img

భారీ బడ్జెట్‌తో నిర్మించి ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకొన్న విజయ్ దేవరకొండ లైగర్‌ చిత్రం హిట్ అయ్యుంటే నేడు అతను కూడా ప్రభాస్‌లాగా ఓ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యుండేవాడు కానీ ఫ్లాప్ అవడంతో దేశంలోనే తలెత్తుకొని తిరగలేకపోతున్నాడు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించి దాని గురించి ఎంతో ఊదరగొట్టేసిన పూరీ జగన్నాథ్ సంగతి చెప్పుకోనక్కరలేదు. లైగర్‌ ఫ్లాప్ అయిందని తెలిసినప్పటి నుంచి ఆయన పత్తాలేడు. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన ఛార్మీ కౌర్ మీడియా ముందే కన్నీళ్ళు పెట్టుకొన్నారు. 

లైగర్‌ మరీ అంత ఘోరంగా లేదు కానీ అతిగా ప్రచారం చేసుకోవడం వలన దానిపై ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయాయి. కానీ సినిమా ఆ స్థాయిలో లేకపోవడంతో ఫ్లాప్ అయ్యింది. ఇదీగాక ఇటీవల తెలుగు సినిమాలు బాలీవుడ్‌ని షేక్ చేస్తుండటంతో, ఇదే అదునుగా బాలీవుడ్‌లో ఎవరైనా పనిగట్టుకొని లైగర్‌పై నెగెటివ్ ప్రచారం చేయించి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ సినిమాలో ఛాంపియన్‌గా నిలిచిన లైగర్‌ బయట ఘోరంగా ఓడిపోయాడు. ఓడిపోయిన లైగర్‌ను అందరూ కలిసి చంపేసారు. 

ఆ చచ్చిన పాము వంటి లైగర్‌ నేటి నుంచి డిస్నీ +హాట్ స్టార్‌లోకి వచ్చింది. ఓటీటీల వలన సినీ పరిశ్రమకు నష్టం అని వాదిస్తున్నవారు ఇప్పుడు అవే లైగర్‌ను ఎంతో కొంత ఆదుకొంటున్నాయని గ్రహిస్తే మంచిది. లైగర్‌ను ఓటీటీ ప్రేక్షకులైన ఆదరించినా ఆదరించకపోయినా లైగర్‌కు కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదనే చెప్పవచ్చు.


Related Post

సినిమా స‌మీక్ష