నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ... చిరు వ్యాఖ్యలు

September 20, 2022


img

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ట్విట్టర్‌లో ఓ ఆడియో మెసేజ్ పోస్ట్ చేశారు. “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నానుంచి దూరం కాలేదు,” అంటూ చిన్న ఆడియో క్లిప్ పెట్టారు. ఈ డైలాగ్ త్వరలో విడుదల కాబోతున్న గాడ్ ఫాదర్‌ చిత్రంలోనిదని సూచిస్తూ, రివాల్వర్ పట్టుకొని ఏదో ఆలోచిస్తున్నట్లున్న చిరంజీవి ఫోటో పెట్టారు. గాడ్ ఫాదర్‌ సినిమాలో చిరంజీవి నల్ల దుస్తులు ధరించినట్లు చూపారు. చిరంజీవి పోస్ట్ చేసిన ఫోటోలో అదే ఉంది. గాడ్ ఫాదర్‌ ప్రమోషన్స్‌పై మెగా అభిమానులు తీవ్ర అసహనంగా ఉన్నందున చిరంజీవి వారికి ఈ చిన్న సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లు అర్దమవుతోంది. 

చిరంజీవి స్వయంగా పోస్ట్ చేసిన ఈ ఆడియో క్లిప్ కూడా పావునిమిషమేఉండటం కాస్త నిరాశ కలిగిస్తున్నప్పటికీ అప్పుడే అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎప్పుడూ సంచలన వార్తల కోసం ఎదురుచూసే న్యూస్ ఛానల్స్ అప్పుడే దీనిపై కోడిగుడ్డుకి ఈకలు పీకుతున్నట్లు “చిరంజీవి మళ్ళీ రాజకీయాలలోకి రాబోతున్నారా?” అంటూ హెడ్డింగ్ పెట్టేసి ఇటీవల ఆయన భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హాజరవడం, దానిలో సిఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్రమోడీలతో ఆప్యాయంగా మాట్లాడటాన్ని పేర్కొంటూ ఊహాగానాలు మొదలుపెట్టేశాయి. 

చిరంజీవి చెప్పిన ఆ రెండు ముక్కలు పట్టుకొని వెబ్‌సైట్లు, న్యూస్ ఛానల్స్ ఎవరికి తోచినట్లు వారు విశ్లేషణలు వ్రాసేస్తున్నారు. గాడ్ ఫాదర్‌ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఈ వార్తలు, విశ్లేషణలు మంచి కాలక్షేపమే. 


Related Post

సినిమా స‌మీక్ష