బింబిసార ఓటీటీలో ఎప్పుడంటే...

August 09, 2022


img

ఎంతో కాలంగా ఓ సరైన హిట్ కోసం పరితపిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్‌కు బింబిసారతో ఆ కోరిక నెరవేరింది. సినిమా రిలీజ్ అయిన తొలిరోజు నుంచే మంచి పాజిటివ్ టాక్‌, మంచి కలెక్షన్లతో దూసుకుపోతుండటంతో ఇండస్ట్రీలో అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతల మండలి నిర్ణయం ప్రకారమే ఈ సినిమాను 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలవుతుందని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు చెప్పారు. కనుక సెప్టెంబర్ 23న ఓటీటీలోకి వస్తుందన్న మాట! 

ప్రస్తుతం దేశంలో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, డిస్నీ +హాట్ స్టార్, జీ5 పెద్ద చిత్రాలను దక్కించుకొనేందుకు పోటీ పడుతున్నాయి. బింబిసార థియేటర్లలో హిట్ అయ్యింది కనుక దానిని దక్కించుకోవడాని అవి పోటీలు పడటం ఖాయం. కనుక ఓటీటీ ద్వారా కూడా వచ్చే భారీ ఆదాయంతో నిర్మాతకు మరింత లాభాలు లభించనున్నాయన్న మాట! వాటిలో ఏ ఓటీటీలోకి  బింబిసార వస్తాడో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. 

కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో బింబిసారగా నటించి తన విశ్వరూపం చూపించుకొని నందమూరి వారసుడు అనిపించుకొన్నాడు. అసలు ఈరోజుల్లో ఇటువంటి హిస్టారికల్ కధాంశంతో సినిమా తీయడమంటే చాలా రిస్క్ అని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ మల్లాది వశిష్ట చెప్పిన కధపై నమ్మకంతో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు.

ఈసారి కళ్యాణ్ రామ్ నమ్మకం వమ్ముకాలేదు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల కనకవర్షం కురూపిస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి నాలుగో రోజు నుంచి లాభాల బాట పట్టింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కలిపి మొదటి నాలుగు రోజులలో రూ. 17.91 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా కేథరిన్‌, సంయుక్తా మేనన్‌ నటించారు.


Related Post

సినిమా స‌మీక్ష