యూపీఐ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రుసుములను నిరసిస్తూ రేపు అక్టోబర్ 2న ‘యూపీఐ బంద్’ నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా వ్యాపార సంఘాలు సిద్దపడ్డాయి. కానీ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన తర్వాత తమ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.
ఈ నెల 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని లావాదేవీలపై 0.4 శాతం వరకు రుసుము విధించాలనే ప్రతిపాదన వలన చిన్న వ్యాపారులు, చిల్లర వర్తకులపై అదనపు భారం పడుతుందని వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యూపీఐ ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలపై రుసుము విధించాలన్న ప్రతిపాదనను వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దీనిపై తమ అభ్యంతరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినందున తమ నిరసనను రద్దు చేసుకున్నట్లు వ్యాపార సంఘాల ప్రతినిధులు తెలిపారు.