సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన మనసులను కలచివేస్తుంది. జిల్లాలో నారాయణఖేడ్ మండలం చాప్తా.కె గ్రామానికి చెందిన ముంగే నర్సారెడ్డి(88), అంజమ్మ(85) వృద్ధ దంపతులు ఆకలి బాధలు భరించలేక బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
అలాగని వారేమీ నిరుపేదలు కారు. గ్రామంలో వారికి 25 ఎకరాల భూమి, సొంత ఇల్లు ఉంది. కానీ వాటిని వారు తమ ముగ్గురు కొడుకులు సిద్ధారెడ్డి, కృష్ణారెడ్డి, సంగారెడ్డిలకు పంచి పెట్టేసినప్పటి నుంచి వారిని కొడుకులు ఇంట్లో నుంచి గెంటేశారు. అప్పటి నుంచి ఆ వృద్ధ దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది. తమని కొడుకులు ఇంట్లో నుంచి తరిమేశారని, తమ జీవనం కోసం కనీసం రెండెకరాలు తిరిగి ఇప్పించాలంటూ గత రెండేళ్ళుగా ఆ వృద్ధ దంపతులు తిరగని కార్యాలయం లేదు. కలవని అధికారి లేరు. కానీ ఇది వారి కుటుంబ సమస్య అంటూ ఎవరూ పట్టించుకోలేదు.
పైగా అంజమ్మ ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. కనుక గత కొన్ని రోజులుగా ఇద్దరూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో మిగిలినవి తింటూ గడిపారు. కానీ కొడుకులు, సమాజం, అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఇద్దరూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కళ్ళెదుట వృద్ధులు అనారోగ్యంతో, ఆకలితో అలమటిస్తున్నా కొడుకులు పట్టించుకోలేదు. మానవత్వం ఉందా లేదా?సమాజం ఇంత నిర్దయగా ఎప్పుడు మారింది?