భార్య, ఇద్దరు పిల్లలు, మరో బాలిక, ఆమె తల్లి, నానమ్మలను అతికిరాతకంగా హత్యలు చేసి దాదాపు నెల రోజులుగా తప్పించుకు తిరుగుతున్న రాజ్ కుమార్ (29) ఆత్మహత్య చేసుకున్నాడు.
రంగారెడ్డి జిల్లాలో కొత్తూరు మండలం, పెంజెర్ల గ్రామ శివారులో అతని మృతదేహాన్ని చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు అక్కడకు చేరుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి రాజ్ కుమార్ అని గుర్తించారు. అతను పురుగుమందు తాగి చనిపోయాడు.
చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తాను ఈ హత్యలు ఎందుకు చేశాడో వివరించాడు. “నన్ను జైలుకి పంపించాలనుకునందుకు ఆ బాలికని, ఆమె తల్లిని, నానమ్మని హత్య చేశాను. తర్వాత నా భార్య పిల్లలని కూడా హత్య చేశాను. నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నా. నేను చేసిన ఈ తప్పులకు నన్ను నేనే శిక్షించుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నా. మా నలుగురి శవాలను అనాధలుగా భావించి శ్మశానవాటికలో కాల్చేయాలని కోరుతున్నా,” అని దానిలో చెప్పినట్లు తెలుస్తోంది.
రాజ్ కుమార్ శవానికి చేవెళ్ళ ప్రభుత్వాసుపత్రి వైద్యులు పోస్టు మార్టం చేశారు. కానీ అతని శవాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.
రాజ్ కుమార్ ఓ బాలికని వేదిస్తున్నందుకు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేయగా వారు అతనిపై పోక్సో కేసు నమోదు చేసినందుకే వారిపై పగ బట్టి హత్య చేశాడు. ఆ తర్వాత తన భార్య పిల్లలని కూడా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.